సాగుపై అవగాహన అవసరం
● భూ పరిరక్షణనకు కృషి చేయాలి
● వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత
ఇబ్రహీంపట్నం రూరల్: భూ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఇబ్రహీంపట్నం వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత విద్యార్థులకు సూచించారు. ఆదిబట్ల సర్కిల్ పరిధి కొంగరకలాన్ జెడ్పీహెచ్‌ఎస్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోషల్ సాయిల్ హెల్త్ కార్యక్రమం నిర్వహించారు. 7వ, 8వ, 9వ తరగతి విద్యార్థులకు భూసారం ప్రాధాన్యత, భూమి, పంటల సంబంధం, భూసార పరిరక్షణ నిమిత్తం సాంపిల్ సేకరించే పద్ధతులను కిట్ ద్వారా నత్రజని, భాస్వరం, పొటాష్ పరిరక్షించే విధానాలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితులుగా విచ్చేసిన వ్యవసాయ శాఖ ఏడీఏ సుజాత , కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా శాస్త్రవేత్త దిలీప్ మాట్లాడుతూ వ్యవసాయం, పంటలు పండించే విధానాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. భూసార పరీక్షలు, నేలల పరిరక్షణ అవసరమన్నారు. సేంద్రియ ఎరువులు వాడకంతో భూసారం పెరుగుతుందని చెప్పారు. పంటల మార్పిడి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి విద్యాధరి, ఏఓ శ్రవణ్‌కుమార్, హెచ్‌ఎం రాజేశ్వర్‌రెడ్డి, రైతులు రవీందర్, ఎం.శేఖర్‌గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


