పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా..
● అదుపుతప్పిన బైక్
● ఒకరు దుర్మరణం, మరొకరికి తీవ్రగాయాలు
మహేశ్వరం: బైక్ అదుపు తప్పి ఒకరు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహేశ్వరం ఠాణా పరిధిలోని మహేశ్వరం గేటు శ్రీశైలం జాతీయ రహదారిపై గురువారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. వనస్థలిపురం రైతు బజార్‌కు చెందిన కడారి నరేశ్, కడారి కిరణ్ తమ స్నేహితుడు హరీశ్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బైక్‌పై మైసిగండి ఆలయానికి వెళ్లి తిరిగివస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో మహేశ్వరం గేటు సమీపంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కిరణ్ బలమైన గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందగా, గాయపడిన నరేశ్‌ను తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరకుని వివరాలు సేకరించారు. అనంతరం బాధితుడి వద్దకే వెళ్లి ఫిర్యాదును స్వీకరించారు. ఎస్‌ఐ రాఘవేందర్ మాట్లాడుతూ పోలీస్ పౌర కేంద్రిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.


