హైదరాబాద్ పోలీస్
కోల్‌కతా కాప్స్ వర్సెస్
సాక్షి, సిటీబ్యూరో/గోల్కొండ: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్–సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య పోరు మాట అటుంచితే...ప్రస్తుతం ఓ మోసగాడి అరెస్టు విషయంలో కోల్‌కతా కాప్స్ వర్సస్ హైదరాబాద్ పోలీసు అనే పరిస్థితి వచ్చింది. గోల్కొండ పోలీసుస్టేషన్‌లో నమోదైన మోసం కేసులో నిందితుడు జస్బిందర్ సింగ్‌ను నగర పోలీసులు గురువారం కోల్‌కతాలో అరెస్టు చేసి తీసుకువచ్చారు. ఇది కిడ్నాప్ అంటూ అతడి స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో అక్కడి షేక్‌స్పియర్ సరానీ ఠాణాలో కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ నిందితుడి అరెస్టుపై తమకు ముందస్తు, తదనంతర సమాచారం లేదని కోల్‌కతా అధికారులు చెప్తుండగా..అలా సమాచారం ఇస్తే ఫలితాలు తారుమారు అవుతున్నాయని నగర పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
నగర వ్యాపారిని మోసం చేసిన కేసు...
నగరంలోని సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న గోల్కొండకు చెందిన సాజిద్ అహ్మద్ ఖాన్ అల్కాపూర్‌లో దుకాణం నిర్వహిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఇరువురు తన స్నేహితుడి ద్వారా ఖాన్‌ను పరిచయం అయ్యారు. ఈయన వ్యాపారాల లావాదేవీలు, విస్తరణపై ఉన్న ఆసక్తిని తెలుసుకున్నారు. ఫుడ్ ప్రాడక్టస్ వ్యాపారంలో ఉన్న హల్దీరామ్స్ సంస్థ డీలర్‌షిప్ ఇప్పిస్తామంటూ ఖాన్‌ను నమ్మించారు. ఈ పక్రియ పూర్తి చేసే దళారి అంటూ కోల్‌కతాకు చెందిన జస్బిందర్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. సింగ్ చెప్పినట్లే ఆయన కంపెనీకి చెందిన ఖాతాలోకి ఖాన్ ఈ నెల 9న రూ.75 లక్షలు బదిలీ చేశారు. ఆపై సింగ్‌తో సహా అందిరి ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో తాను మోసపోయినట్లు ఖాన్ గ్రహించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు ఈ నెల 13న కేసు నమోదు చేసుకున్నారు. ఇందులో జస్బిందర్ సహా నలుగురిని నిందితులుగా చేర్చారు.
వారికి చెప్తే వీళ్లు చెక్కేస్తున్నారు...
ఇతర రాష్ట్రాల్లో నిందితుల అరెస్టు అనేది సర్వసాధారణమే. ప్రధానంగా చీటింగ్ కేసులతో పాటు సైబర్ నేరాల్లో నిందితులుగా ఉన్న వారి కోసం గాలిస్తూ పోలీసులు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఉన్నతాధికారుల నుంచి లిఖిత పూర్వక అనుమతి తర్వాతే ఇలా వెళ్తారు. గతంలో ఇలా వెళ్లిన బృందాలు కచ్చితంగా అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చి, వారితో కలిసి నిందితుల వద్దకు వెళ్లేవి. అయితే కొన్నాళ్లు ఇలా సమాచారం ఇచ్చిన వెంటనే ఆ విషయం నిందితులకు తెలిసిపోతోంది. ఆ వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్న కేటుగాళ్లు నగర పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నారు. దీంతో తమ పంథా మార్చిన నగర పోలీసులు రహస్యంగా వెళ్లి నిందితుల్ని పట్టుకుంటున్నారు. ఇలా అరెస్టు చేసినప్పుడు పరిస్థితుల్ని బట్టి అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై తీసుకురావడమో... నేరుగా తీసుకువచ్చి ఇక్కడి కోర్టులో హాజరుపరచడమో చేస్తున్నారు. జస్బిందర్ సింగ్ అరెస్టు విషయంలోనూ తాము నిబంధనలు పాటించామని, కోల్‌కతా పోలీసుల కేసును చట్ట పరంగా ఎదుర్కొంటామని సిటీ అధికారులు చెప్తున్నారు.
రూ.75 లక్షలు మోసం కేసులో నిందితుడిగా జస్బిందర్
అక్కడకు వెళ్లి అరెస్టు చేసిన గోల్కొండ పోలీసులు
దీనిపై షేక్‌స్పియర్ సరానీ ఠాణాలో కిడ్నాప్ కేసు నమోదు
తమకు ముందస్తు సమాచారంలేదంటున్న ఆ అధికారులు
సమాచారం ఇస్తే ఫలితాలుతారుమారని చెప్తున్న సిటీ కాప్స్
అరెస్టు విషయంలో ఏర్పడిన వివాదం...
ఈ కేసు దర్యాప్తులో భాగంగా గోల్కొండ పోలీసులు నిందితుల ఆచూకీ ఆరా తీశారు. సాంకేతిక ఆధారాలను బట్టి హౌరాకు చెందిన సింగ్ కోల్‌కతాలోని కామిక్ స్ట్రీట్‌లో ఉన్న ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు. నగరం నుంచి వెళ్లిన ప్రత్యేక బృందం గురువారం ఉదయం ఆ హోటల్‌లోని రూమ్ నెం.418లో ఉన్న సింగ్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చారు. దీనిపై సింగ్ స్నేహితుడు, జార్ఖండ్‌కు చెందిన అజిత్ కుమార్ దాస్ సమాచారంతో షేక్‌స్పియర్ సరానీ పోలీసులు ‘హైదరాబాద్ పోలీసులుగా చెప్పుకున్న వ్యక్తుల’పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ అరెస్టుపై తమకు ముందస్తు, తదనంతర సమాచారం లేదని ఆ పోలీసులు చెప్తున్నారు. హోటల్ నిర్వాహకుడు చెప్పిన వివరాల ప్రకారం ఆ వ్యక్తులు గోల్కొండ పోలీసులుగా భావిస్తూ షేక్‌స్పియర్ సరానీ అధికారులు ఈ–మెయిల్ ద్వారా సమాచారం అడిగారు. దీంతో తామే చీటింగ్ కేసులో సింగ్‌ను అరెస్టు చేసినట్లు నగర అధికారులు జవాబు ఇచ్చారు. ఎలాంటి సమాచారం లేకుండా ఇలా అరెస్టు చేయడం చట్ట వ్యతిరేకం అని కోల్‌కతా పోలీసులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ పోలీస్
హైదరాబాద్ పోలీస్


