హిందువులపై దాడులు అరికట్టాలి
ఇబ్రహీంపట్నం రూరల్: పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని విశ్వహిందూ పరిషత్ విభాగ్ సహకార్యదర్శి బూరుగు రమణ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై దాడికి నిరసనగా శనివారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డీఆర్‌ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ విభాగ్ సహకార్యదర్శి బూరుగు రమణ మాట్లాడుతూ.. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించడం పేరుతో బెంగాల్ మొత్తం హింసాకాండలో కాలిపోతోందని అన్నారు. బెంగాల్‌లో భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేయడం ద్వారా తమ ప్రభుత్వాన్ని ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మమత ప్రభుత్వం చేస్తున్న కుట్రలన్నారు. హిందూ ఉనికికి ప్రమాదం వాటిల్లిందని, హిందువులకు భద్రత కల్పించాలన్నారు. బెంగాల్‌లో వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని, హింసపై ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని కోరారు. బంగ్లాదేశ్ రోహింగ్యా చొరబాటుదారులను గుర్తించి బహిష్కరించాలన్నారు. కార్యక్రమంలో చింతల వెంకన్న, శ్రీనివాస్, రాజు, రాఘవేందర్, మహేశ్, విక్రం, సురేష్, రాజు పాల్గొన్నారు.
అధికారుల సమన్వయం భేష్
యాచారం: ఫార్మాసిటీ భూముల సర్వే, ఫెన్సింగ్‌లో అధికారుల సమన్వయం బాగుందని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పేర్కొన్నారు. నానక్‌నగర్‌లో శనివారం ఫార్మాసిటీ భూముల సర్వే, ఫెన్సింగ్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న రెవెన్యూ, పోలీస్, టీజీ ఐఐసీ, సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులతో మర్యాదగా ఉందాం.. వారి సమస్యలు తెలుసుకుందాం, న్యాయం చేద్దాం.. ఇదే మాదిరిగా ఐక్యతతో ఉండి టార్గెట్ పూర్తి చేద్దామని పేర్కొన్నారు. రైతుల నుంచి ఏ ఇబ్బందులు వచ్చినా క్షేత్రస్థాయి సిబ్బంది వెంటనే సీఐ, తహసీల్దార్, ఆర్డీఓ, ఏసీపీల దృష్టికి తేవాలన్నారు. వేసవి తీవ్రతలో సర్వే, ఫెన్సింగ్ పనుల్లో నిమగ్నమవుతున్న సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించాలని టీజీఐఐసీ అధికారులకు ఆమె సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని రైతులతో మాట్లాడుతూ.. ఫూచర్‌సిటీ నిర్మాణానికి సహకరించాలని కోరారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు,యాచారం తహసీల్దార్ అయ్యప్ప, టీజీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించండి
ఇబ్రహీంపట్నం రూరల్: ఫార్మాలో పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, ఫార్మాతో పాటు గ్రీన్ ఫీల్డ్ రోడ్డులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. సీపీఎం యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ ఆధ్వర్యంలో శనివారం మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డిని ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పగడాల యాదయ్య మాట్లాడుతూ.. ఫార్మాసిటీ పేరుతో 10,200 ఎకరాల అసైన్డ్ భూములు, 9,133 ఎకరాల పట్టా భూములు తీసుకున్నారని తెలిపారు. వెంటనే రైతులకు రుణమాఫీ, రైతుబీమా చేయాలని, భూములు కోల్పోయిన రైతులకు 121 గజాలకు బదులు 500 గజాల ప్లాట్లు ఇవ్వాలన్నారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కందుకూరు మండల కార్యదర్శి బుట్టి బాలరాజు, నాయకులు మల్లేష్, పౌలు, గడ్డం యాదగిరి, రాములు, సంజీవ, గోవర్ధన్ పాల్గొన్నారు.
నేటి నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల పునరుద్ధరణ
సాక్షి, సిటీబ్యూరో: వివిధ మార్గాల్లో నిలిపివేసిన 26 ఎంఎంటీఎస్ సర్వీసులను ఈ నెల 20 నుంచి పునరుద్ధరించనున్నట్లు శనివారం దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు లింగంపల్లి–ఫలక్‌నుమా, ఫలక్‌నుమా–నాంపల్లి, ఫలక్‌నుమా–మేడ్చల్, ఫలక్‌నుమా–ఉందానగర్, నాంపల్లి–మేడ్చల్, సికింద్రాబాద్–మేడ్చల్ మధ్య నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు యథావిధిగా రాకపోకలు సాగించనున్నాయి.


