డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడి అరెస్టు
బంజారాహిల్స్: డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడిని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–11 తాడిపత్రి బిర్యానీ సెంటర్ సెంటర్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న వెస్ట్‌గోదావరి జిల్లా, భీమవరానికి చెందిన కోపర్తి సాయి మణికంఠ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తనిఖీ చేయగా 07 గ్రాముల కొకై న్, 3.7 గ్రాముల ఎక్‌టసీ పిల్స్ లభించాయి. ఓ పెడ్లర్ నుంచి కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. పోలీసులు అతడి వద్ద నుంచి మత్తు పదార్థాలు, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
బాలుడి దారుణ హత్య
అత్తాపూర్: గంజా యి మత్తులో జరిగిన ఘర్షణలో ఓ బాలుడిని బండరాళ్లతో మోది హత్య చేసిన సంఘటన అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు కథనంమేరకు వివరాలిలా ఉన్నాయి. గోల్డెన్ సిటీ హసన్‌నగర్ ప్రాంతానికి చెందిన రఫిక్ కుమారుడు రహీం(14) ఆవారాగా తిరుగుతున్నాడు. గంజాయికి అలవాటు పడిన అతను ఇతరులతో గొడవ పడుతూ ఉండేవాడు. గురువారం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన రహీంకు అతని స్నేహితులతో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఓ బాలుడు అతడి తలపై బండరాయితో మోది హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మృతుడి తండ్రి రఫిక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగం ఇప్పిస్తానని టోకరా
హోంగార్డుపై కేసు నమోదు
పంజగుట్ట: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన హోంగార్డుపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉప్పల్, ప్రతాప్ సింగారం ప్రాంతానికి చెందిన సునీల్ గౌడ్‌కు తన స్నేహితుల ద్వారా చంద్రప్రకాష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. చంద్రప్రకాష్ ఒక పోలీస్ ఉన్నతాధికారి వద్ద డ్రైవర్‌గా పని చేసేవాడు. 2024లో సునీల్ తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నానని, గ్రూప్ ఫోర్ ఉద్యోగానికి పరీక్ష రాసిందని చంద్రప్రకాష్‌కు చెప్పాడు. దీంతో చంద్రప్రకాష్ తాను ఉన్నతాధికారులతో మాట్లాడి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఇందుకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని చెప్పి రూ. 3 లక్షలు తన అకౌంట్‌కు ట్రాన్స్‌వర్ చేయించుకున్నాడు. మరో రూ.3 లక్షలకు చెక్కులు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోక పోగా ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సునీల్ పంజగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


