● ఏక కాలంలో రూ.2 లక్షలు మాఫీ చేసిన ఘనత మాదే ● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ● మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం
మహేశ్వరం: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమ ని ఐటీ, పరిశ్రమలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రిదుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి రూ.2 లక్షలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్‌కే దక్కిందని పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో కొంత మందికి రుణమాఫీ కాలేదని, వాటిని పరిశీలించి అర్హులందరికీ మాఫీ అయ్యేలా చూస్తామని చెప్పారు. దీనిపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నామని, వాటిని పార్టీ శ్రేణులు తిప్పి కొట్టి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
భూ బాధితులను ఆదుకుంటాం
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు కోల్పోతున్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలిపారు. మార్కెట్ కమిటీ పాలకవర్గంలో ఎస్టీ గిరిజన, బీసీ రజక సామాజిక వర్గాలకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కాయని మంత్రి అన్నారు. అంతకు ముందు పాలకవర్గ సభ్యులు చైర్మన్ సభావత్ కృష్ణా నాయక్, వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, డైరెక్టర్లుగా పుష్ప, ప్రశాంత్ కుమార్, కె.యుగేందర్, సురేందర్, విష్ణువర్ధన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ఎంఏ.జావీదు, బోధ పాండు రంగారెడ్డి, యాదయ్య, ధన్‌పాల్‌రెడ్డి, పాండు మార్కెటింగ్ శాఖ అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి కృషి చేస్తామని సభ్యులు పేర్కొన్నారు. మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, జెడ్పీ చైర్‌పర్సన్ మాజీ సభ్యురాలు అనితారెడ్డి, పీసీసీ సభ్యుడు భాస్కర్‌రెడ్డి, మాజీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ జంగారెడ్డి, ఎస్సీసెల్ కన్వీనర్ నర్సింహ, మాజీఎంపీపీ రఘుమారెడ్డి పాల్గొన్నారు.