లాకప్‌డెత్‌పై సీబీఐ విచారణ జరిపించాలి
పంజగుట్ట: కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్‌డెత్ కేసును సీబీఐతో గానీ..హైకోర్టు సిట్టింగ్ జడ్జితోగానీ విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాజేష్ లాకప్‌డెత్ అయ్యి రెండు నెలలు గడుస్తోందని.. అప్పటి నుంచి పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగితే కోదాడ, చిలుకూరు పోలీసులు గాంధీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. గాంధీలో పోస్టుమార్టం చేయాల్సిన డాక్టర్‌ను రాత్రికి రాత్రి మార్చేశారని.. గాంధీలో వీడియో తీయాల్సిన వ్యక్తితో కాకుండా కోదాడ నుంచి అగ్రకులానికి చెందిన వీడియో గ్రాఫర్‌ను తీసుకురావడం, వైద్యునితో వారికి అనుకూలంగా రిపోర్టు రాయించడం ప్రతి ఒక్కటీ కేసు నుంచి ఎలా బయటపడదామని పోలీసులు తప్పులమీద తప్పులు చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరుకు ఇటీవల మానవ హక్కుల కమిషన్ కూడా లాకప్‌డెత్ కేసుల్లో పోస్టుమార్టం నిస్పక్షపాతంగా జరగడంలేదని, వైద్యులు పోలీసులకు అనుకూలంగా రిపోర్టు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాజేష్ లాకప్‌డెత్‌పై నిజాలు ప్రజలకు వివరించేందుకు ఈ నెల 18వ తేదీన సూర్యాపేటలో ఎమ్‌ఆర్‌పీఎస్, దాని అనుబంధ సంఘాల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


