జిల్లాగా మారేనా?
రాజధాని ముఖద్వారంగాఅతిపెద్ద పట్టణం పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో అగ్రగామి అందుబాటులో అతిపెద్ద జాతీయ రహదారి ఇటీవలే ఫ్యూచర్ సిటీలోకి..
షాద్‌నగర్: దేశంలో అత్యంత పొడవైన 44వ జాతీ య రహదారి పక్కన మకాం.. రాజధానికి ముఖ ద్వా రంగా అతిపెద్ద పట్టణం.. పారిశ్రామికంగా, స్థిరా స్తి వ్యాపారాల పరంగా అగ్రగామి.. ఒకప్పటి రాజుల ఖిల్లా.. ఈ అర్హతలతో అవుతుందా జిల్లా.. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా మారిన ఈ పట్టణాన్ని జిల్లాగా మార్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఫ్యూచర్ సిటీలో ఉన్న పట్టణాల్లో అతిపెద్ద పట్టణంగా విస్తరించిన షాద్‌నగర్ జిల్లా కేంద్రంగా మారడానికి కావాల్సిన అవకాశాలు, అర్హతలు అన్నీ ఉన్నాయి.
గతమెంతో ఘనకీర్తి
షాద్‌నగర్ ప్రాంతం 16–17వ శతాబ్దాల్లో వనపర్తి సంస్థానంలో అంతర్భాగంగా ఉండేది. ఈ ప్రాంతాన్ని సవై వెంకట్‌రెడ్డి అనే రాజు పాలించారు. ఆయన హయాంలో ఇది జానంపేటగా గుర్తింపు పొందింది. తర్వాత నిజాంకాలంలో ఇక్కడ రాజుగా పని చేసిన ఆజం ఆలీఖాన్ దగ్గర రాజుగా పని చేసిన కిషన్ ప్రసాద్ బహదూర్ కవి కావడంతో ఆయన కలం పేరు షాద్ అని పెట్టుకున్నారు. అందరూ ఆయనను ఆపేరుతోనే పిలిచేవారు. అలా ఈ ప్రాంతాన్ని షాద్‌నగర్‌గా పిలవడం మొదలుపెట్టారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఈ ప్రాంతానికి గొప్ప పేరుంది. ఉద్యమకారులుగా పేరు పొందిన బూర్గుల రామకృష్ణారావు, శ్రీనివాసరావు, ఎన్‌కే రంగారావు, నర్సింగరావు తదితరులు ఇక్కడివారే. వీరిలో బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలిముఖ్యమంత్రిగా పనిచేశారు.
తొలి అసెంబ్లీ జాబితాలో..
స్వాతంత్య్రం వచ్చాక రూపొందించిన మొదటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో షాద్‌నగర్ కూడా ఉంది. బూర్గుల రామకృష్ణారావు ఇక్కడి నుంచి ఎమ్మె ల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. 1959లో మొదటి పంచాయతీని అప్పటి ప్రధాని నెహ్రూ ఇక్కడే ప్రారంభించారు. అప్పటి వరకు మున్సిపాలిటీగా ఉన్న ఈ ప్రాంతం తర్వాత మేజర్ పంచాయతీగా మారింది. 2011లో తిరిగి మున్సిపాలిటీగా గుర్తించారు. బీఆర్‌ఎస్ హయాంలో రెవె న్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏసీపీ కార్యాలయం పరిధిలో ఉన్న ప్రాంతాన్ని డీసీపీ కార్యాలయం పరిధిలోకి మార్చారు.
అర్హతలు ఇలా..
44వ జాతీయ రహదారి మీదుగా ఉన్న ఈ ప్రాంతంలో బస్‌స్టాండ్, రైల్వే స్టేషన్ సదుపాయాలతో పాటు కేవలం 28 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉంది. 1975లో పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న షాద్‌నగర్‌లో మల్టీనేషనల్ పరిశ్రమలను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి సుమారు 36వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం మినీఇండియాగా మారింది. ఇక నేషనల్ రిమోట్ ఏజెన్సీ, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, పీఆండ్‌జీ వంటి తదితర కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇక వ్యాపార పరంగా 2004 నుంచి రియల్ ఎస్టేట్ బాగా విస్తరించింది. రాజధానికి కేవలం 45కిలోమీటర్ల దూరంలో ఉన్న షాద్‌నగర్ ఆరు మండలాలతో కూడిన నియోజకవర్గం. 70వేల జనాభా కలిగిన అతిపెద్ద పట్టణం. ఏ రకంగా చూసినా జిల్లా కేంద్రంగా మార్చడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీలో భాగంగా ఉన్న షాద్‌నగర్‌ను జిల్లా కేంద్రంగా మారిస్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం కృషి చేస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.
షాద్‌నగర్ వైపు అందరి చూపు
అన్ని అర్హతలు ఉన్నాయి
షాద్‌నగర్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. జిల్లా కేంద్రం ఏర్పాటుకు కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి
– ఎమ్మె సంతోష్,
జిల్లా సాధన సమితి అధ్యక్షుడు, షాద్‌నగర్
పాలన మరింత సులభం
ఫ్యూచర్ సిటీలో భాగంగా ఘన చరిత్ర కలిగిన షాద్ నగర్‌ను జిల్లా కేంద్రంగా మారిస్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పాలన మరింత సులభంగా ఉంటుంది.
– కాసోజు శివకుమార్, న్యాయవాది, షాద్‌నగర్
జిల్లాగా మారేనా?
జిల్లాగా మారేనా?


