దోబూచులాట
కార్పొరేషన్ ఒకటేనా.. మూడయ్యేనా?
సాక్షి, సిటీబ్యూరో: ఏడాది కాలంగా కొనసాగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) విభజన రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. తాజాగా జీహెచ్‌ఎంసీ మొత్తాన్ని (300 వార్డులు) ఒకే కార్పొరేషన్‌గా పేర్కొంటూ ఎన్నికల రిజర్వేషన్లను ప్రకటించడంతో పలువురిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2011 జనాభా లెక్కలు, బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక, తెలంగాణ మున్సిపల్ యాక్ట్– 2019 మేరకు అంటూ ప్రభుత్వం పేర్కొనడంతో.. జీహెచ్‌ఎంసీ ఇక ఒకే కార్పొరేషన్‌గా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. వార్డుల్ని 300గా పేర్కొనడం ఇందుకు ఊతమిచ్చేలా ఉంది. దాదాపు ఏడాది క్రితం నుంచే జీహెచ్‌ఎంసీ పరిధి పెంచి రెండు నుంచి నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయనున్నట్లు లీకులిస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికీ ఇంకా స్పష్టతనివ్వలేదు.
కొరవడిన స్పష్టత..
గత నెలలో 27 స్థానిక సంస్థల్ని జీహెచ్‌ఎంసీలో విలీనం చేసి 150 వార్డుల్ని 300 వార్డులకు పెంచడం తెలిసిందే. పరిధి పెరిగిన జీహెచ్‌ఎంసీ మొత్తం ఒకటే కార్పొరేషన్‌గా ఉంటుందంటూ ఒకసారి.. లేదు రెండు, మూడు, నాలుగు కార్పొరేషన్లు కావచ్చంటూ వివిధ సందర్భాల్లో చర్చలు జరిగినా ప్రభుత్వం నుంచి ఔనని కానీ, కాదని కానీ స్పష్టత లేదు. వార్డుల పెంపుతో పాటు 6 జోన్లను 12 జోన్లుగా మార్చాక రెండు జోన్లకు ప్రత్యేకంగా అడిషనల్ కమిషనర్లుగా ఐఏఎస్‌ల నియామకం.. ఆయా విభాగాల అధికారుల బదిలీలు, పోస్టింగులు, తదితరమైన వాటితో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లు ఏర్పాటు కావడం లాంఛనమేనని, ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చేనెల 10వ తేదీతో ముగియనున్నందున, 11వ తేదీనుంచే కొత్త కార్పొరేషన్లుగా పాలన మొదలు కానుందనే అభిప్రాయాలు బలపడ్డాయి. అంతేకాదు. ఈ మూడు కార్పొరేషన్లు, మూడు పోలీస్ కమిషనరేట్లతో పాటు మూడు జిల్లాల పరిధుల్లో ఉండనున్నాయనీ అధికార వర్గాలు సైతం భావించాయి.
తొందరెందుకు?
ప్రస్తుత పాలకమండలి గడువు ముగిశాక జీహెచ్‌ంఎసీని విభజించి మూడు కార్పొరేషన్లుగా చేస్తారని చెబుతున్న పరిశీలకులూ ఉన్నప్పటికీ, పాలకమండలి గడువు దాదాపు మూడు వారాలు మాత్రమే ఉంది. గడువు ముగిశాకే మూడు కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ప్రకటించవచ్చు కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్పొరేషన్‌ను మాత్రం జీహెచ్‌ఎంసీగా ఉంచి, వార్డుల్ని 300గా పేర్కొనడంతో పలు సందేహాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఆయా అంశాలకనుగుణంగా రిజర్వేషన్లు ప్రకటించినా.. తర్వాత మూడు కార్పొరేషన్లుగా విభజించవచ్చని చెబుతున్న వారు కూడా ఉన్నారు. మూడు కార్పొరేషన్లుగా మారితే ప్రస్తుతం 300 వార్డులను పరిగణనలోకి తీసుకొని పేర్కొన్న రిజర్వేషన్లు.. విభజన తర్వాత ఏదైనా ఒకటి లేదా రెండు కార్పొరేషన్ల పరిధిలోకే వెళ్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. విభజనలో భాగంగా హైదరాబాద్ కార్పొరేషన్ 150 వార్డులతో, సైబరాబాద్ కార్పొరేషన్ 76 వార్డులతో, మల్కాజిగిరి కార్పొరేషన్ 74 వార్డులతో ఉంటాయన్నది ఇప్పటికే ప్రజల్లో మదిలో నాటుకుంది
ప్రకటన మేరకు జీహెచ్‌ఎంసీ రిజర్వేషన్లు ఇలా ..
కార్పొరేషన్: జీహెచ్‌ఎంసీ
వార్డులు: 300
ఎస్టీ: 5
ఎస్సీ: 23
బీసీ: 122
మహిళ (జనరల్): 76
అన్‌రిజర్వ్: 74
త్వరలో కొత్త ప్రకటన
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పేరిటే 300 వార్డులకు రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ, ఇవి మారేందుకు అవకాశం ఉందని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పాలకమండలి గడువుకు అటూ ఇటూగా మూడు కార్పొరేషన్ల పేరిట వేర్వేరుగా రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి పరిస్థితి గందరగోళంగా మారింది.
ఉద్యమం సైతం
మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ఇక లాంఛనమనే అభిప్రాయంతోనే సికింద్రాబాద్ కార్పొరేషన్ పేరిట ఒక కార్పొరేషన్ ఉండాలని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్, సికింద్రాబాద్ స్థానికులతో ఉద్యమానికి సిద్ధం కావడం తెలిసిందే.
దోబూచులాట


