కాంగ్రెస్‌ నమ్మించి మోసం చేసింది | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నమ్మించి మోసం చేసింది

Published Mon, Nov 27 2023 7:10 AM | Last Updated on Mon, Nov 27 2023 7:10 AM

మాట్లాడుతున్న బృందా కారత్‌  - Sakshi

మాట్లాడుతున్న బృందా కారత్‌

పేదల భూములు లాక్కొంటున్నారు

ఇబ్రహీంపట్నం: పేదల భూములు లాక్కొని విషం విరజిమ్మే ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా రని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్‌ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఇబ్రహీంపట్నంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో పార్టీ అభ్యర్థి పగడాల యాదయ్య తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వంతో కుమ్మకై ్క పేద, దళిత, ఆదివాసులకు చెందిన వేలాది ఎకరాలు గుంజుకుంటున్నారని ఆరోపించారు. వారికి 2013 చట్ట ప్రకారం కూడా నష్టపరిహారం చెల్లించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం స్థానిక నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు. ఇష్టా నుసారంగా భూములు లాక్కుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. అదానీ, అంబానీల కోసం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకోస్తే తిప్పికొట్టామని గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లోనే బీజేపీ పాలన సాగిస్తోందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని పేర్కొన్నారు. దళిత ముఖ్యమంత్రి, మూడేకరాల భూమి, డబుల్‌ బెడ్రూం ఇళ్ల జాడే లేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. కేరళలో వామపక్ష ప్రభుత్వ పాలనలో ప్రజలకు అన్ని సౌకర్యాలు అందిస్తున్నట్లు చెప్పారు. కార్మిక, కర్షక, ప్రజానీకానికి ఎర్ర జెండా అండగా నిలబడుతుందన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి పగడాల యాదయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ, రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఆశాలత తదితరులు పాల్గొన్నారు.

మీర్‌పేట్‌: ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్‌ తమను నమ్మించి మోసం చేసిందని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం కార్పొరేషన్‌ పరిధిలోని జిల్లెలగూడ, బాలాపూర్‌ చౌరస్తాలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ మాదిగలను మోసం చేసిందన్నారు. ఈ విషయంలో బీజేపీ స్పష్టమైన హామీ ఇచ్చిందని చెప్పారు. ఆ మేరకు కమిటీ ఏర్పాటు చేసి, వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసిందన్నారు. దళితులను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మోసం చేస్తే.. బీజేపీ వారికి అండగా నిలిచిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని, మంత్రి వర్గంలో కనీస ప్రాధాన్యత కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి.. ఇవ్వకుండా మోసం చేశారని, ప్రశ్నించినందుకు తనపై కేసులు నమోదు చేయించి జైలుకు పంపారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని, ఆ మేరకు ప్రక్రియను కూడా ప్రారంభించిందని చెప్పారు. బలహీన వర్గాలకు చెందిన అందెల శ్రీరాములు యాదవ్‌ను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ రోడ్‌షోలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్లు భీంరాజు, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్‌

ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement