యాచారం: అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. వివరాల ప్రకారం.. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి 10.30గంటల ప్రాంతంలో కందుకూరు మండలం మీరాఖాన్‌పేట నుంచి యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి వచ్చారు. వీరిలో ఇద్దరు కారులో, మరొక యువకుడు బైక్‌పై వచ్చారు. కుర్మిద్ద గ్రామంలో నీలం పాండుకు చెందిన ఆటోను కారులో వచ్చిన ఇద్దరిలో ఒక వ్యక్తి తీసుకుని తాడిపర్తి గ్రామం వైపు వెళ్తున్నాడు. గమనించిన పాండు విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో అప్రమత్తమైన యువత ఆటోను వెంబడిస్తూ తాడిపర్తి గ్రామంలోని స్నేహితులకు సమాచారం ఇచ్చారు. తాడిపర్తి గ్రామానికి చెందిన యువత పట్టుకునే లోపే తప్పించుకుని వెనుక వస్తున్న తన స్నేహితుడి బైక్‌పై నానక్‌నగర్ గ్రామం వైపు వెళ్లారు. వెంటనే తాడిపర్తి యువత నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన యువతకు ఫోను చేసి విషయం వివరించారు. అప్రమత్తమైన నక్కర్తమేడిపల్లి గ్రామస్తులు బైక్‌పై వస్తున్న వారిని పట్టుకున్నారు. కారులో నందివనపర్తి గ్రామం వైపు వెళ్లిన మరో వ్యక్తి నందివనపర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఫోను తీసుకుని బైక్ వెళ్తూ దొరికిన వారికి ఫోన్ చేశాడు. దీంతో నక్కర్తమేడిపల్లి గ్రామస్తులు కారులో దొంగలు ఉన్నారు. వారిని పట్టుకోమని చెప్పారు. నక్కర్తమేడిపల్లిలో దొరికిన ఇద్దరి వ్యక్తులను, నందివనపర్తి గ్రామంలో దొరికిన మరో వ్యక్తిని పట్టుకుని ఆదివారం అర్ధరాత్రే పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
వెంటాడి పట్టుకున్న యువత