
ఏఎంసీ చైర్మన్ వర్సెస్ డైరెక్టర్లు
చేవెళ్ల: చేవెళ్ల మార్కెట్ కమిటీలో చైర్మన్, డైరెక్టర్ల మధ్య సయోధ్య కుదరక రచ్చకెక్కుతున్నారు. తాను మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తుంటే తనపై కుట్రతో ఆరోపణలు చేస్తున్నారని.. డైరెక్టర్లు మార్కెట్ కార్యదర్శి మహేందర్‌కు ఫోన్ చేసి ప్రతీ నెలా డబ్బులివ్వాలని బెదిరిస్తున్నారంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్ ఆరోపిస్తుంటే.. చైర్మన్ తమను పట్టించుకోవడం లేదని.. మార్కెట్ కార్యదర్శితో కలిసి అవినీతికి పాల్పడుతున్నారంటూ మార్కెట్‌కమిటీ డైరెక్టర్లు ఆరోపణలతో వివాదం మొదలైంది.
అభివృద్ధికి సహకరించాలి
చేవెళ్ల మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ పెంటయ్యగౌడ్, వైస్ చైర్మన్ రాములు, కార్యదర్శి మహేందర్ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కె ట్ కమిటీ డైరెక్టర్లు అసత్య ఆరోపణలతో మార్కెట్‌ను బదనాం చేస్తున్నారని.. వారి సొంత నిర్ణయాలను ప్రశ్నిస్తే ఆరోపణలు చేస్తున్నా రని మండిపడ్డారు. మార్కెట్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సహకారంతో రూ.2 కోట్లకు పైగా నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. కొందరు డైరెక్టర్లు చిన్న విషయాలను రాద్దాంతం చేస్తున్నారన్నారు. సెక్రటరీకి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడడం, డబ్బులు డిమాండ్ చేయడం, కమీషన్ ఏజెంట్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నామంటూ అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. అవి నిజమైతే రుజువు చేయాలని డిమాండ్ చేశారు. పాలకవర్గ సమావేశంలో తీర్మానాలు చేసిన డైరెక్టర్లే తాము చేయ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికై నా డైరెక్టర్లు మార్కెట్ అభివృద్ధికి కలిసిరావాలన్నారు.
పదవులకు రాజీనామా చేస్తాం: డైరెక్టర్లు
మార్కెట్ అభివృద్ధి కోసం చైర్మన్‌ను ప్రశ్నిస్తే తమపై కార్యదర్శితో ఆరోపణలు చేయించడం సరికాదని డైరెక్టర్లు జనార్ధన్, మల్లేశ్, నరేందర్, సత్యనారాయణ, హనీఫ్ అన్నారు. మార్కెట్ అభివృద్ధికి సంబంధించిన వివరాల లెక్కలు అడిగితే తమై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య జన్మదిన వేడుకలకు పాలకవర్గాన్ని పట్టించుకోకుండా చైర్మన్ ఒక్కరే తన ఫొటోతో ఫ్లెక్సీలు వేయించుకుని పాలకవర్గాన్ని దూరం పెట్టాడన్నారు. డైరెక్టర్లు లేకుండానే మార్కెట్ కమిటీ సమావేశం నిర్వహించి తాము హాజరైనట్లు రికార్డు చేశారని ఆరోపించారు. కమీషన్ ఏజెంట్లు తక్‌పట్టీలు ఇవ్వడం లేదని చెబితే పట్టించుకోవడం లేదన్నారు. తక్ పట్టీలు ఇవ్వకుండా చైర్మన్, కార్యదర్శి కలిసి అడ్డుకుంటున్నారన్నారు. దీనిపై ప్రశ్నిస్తే డైరెక్టర్లు డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపిస్తున్నారని అన్నారు. అవసరమైతే తమ డైరెక్టర్ల పదవులకే రాజీనామాలు చేస్తామన్నారు.
చేవెళ్ల మార్కెట్ కమిటీ పాలకవర్గంలో మనస్పర్థలు
అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపణలు