ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
ఆమనగల్లు: కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 27న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో ఆటో ఆకలి కేకల మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభను విజయవంతం చేయాలని కోరుతూ 25 రోజులుగా నిర్వహిస్తున్న ఆటో రథయాత్ర మంగళవారం ఆమనగల్లుకు చేరుకుంది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఆటో రథయాత్రకు స్థానిక ఆటో జేఏసీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం మహాసభ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంద రవికుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటోడ్రైవర్లకు ఉపాధి కరువైందని అన్నారు. 83 మంది ఆటోడ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలని, ప్రతి ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.12 వేలు అందించాలని, ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 27న జరిగే మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.


