
ఇరిగేషన్ శాఖ డీఈఈ ఆత్మహత్య
శంషాబాద్: పురుగుల మందు తాగి నీటి పారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం ఆర్‌జీఐఏ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బాలరాజు తెలిపిన ప్రకారం.. కొత్వాల్‌గూడ చౌడమ్మ దేవాలయ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. పర్సులో లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా అతడు నాగోల్‌లో నివాసముంటున్న నేరెళ్ల వెంకటరామరాజు(63)గా గుర్తించారు. నీటి పారుదల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నట్లు ఉంది. అతడి వద్ద లభ్యమైన ఫోన్ నంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా తాము తిరుపతిలో ఉన్నట్లు తెలిపారు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.