
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ
యాచారం: ఉపాధి పనుల్లో అవకతవకలు పరిపాటయ్యాయి. మంగళవారం మండల కేంద్రంలో 16వ ఈజీఎస్ సామాజిక తనిఖీ మండల ప్రజావేదిక నిర్వహించారు. డీఆర్డీఓ శ్రీలత, అంబుడ్స్‌మెన్ సునీత, విజిలెన్స్ అధికారి కొండయ్య, ఏపీడీ చరణ్, ఇన్‌చార్జి ఎంపీడీఓ శైలజ, ఎంపీఓ శ్రీలత, ఏపీఎం లింగయ్య ఆధ్వర్యంలో ఈ ప్రజావేదిక కొనసాగింది. మండల పరిధిలోని 24 పంచాయతీల్లో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31వరకు రూ.5.5 కోట్లకు పైగా నిధులు వెచ్చించి కూలీలకు ఉపాధి కల్పించినట్లు గుర్తించారు. పలు గ్రామాల్లో సక్రమంగా రికార్డులు నమోదు చేయకపోవడం, కూలీలు చేసిన పనులకు సకాలంలో డబ్బులు జమ కాకపోవడం, ఒకరి పేరు మీద రికార్డులు మరొకరి పేరిట నమోదు చేయడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా డీఆర్డీఓ శ్రీలత మాట్లాడుతూ.. ఉపాధి పనులు కల్పించే విషయంలో గాని, కూలీలకు డబ్బులు ఇచ్చే విషయంలో గాని, స్లిప్పులు అందజేసే విషయంలోగాని తప్పులు చేసిన వారిని వదలమని హెచ్చరించారు. కూలీలకు చేతినిండా పని కల్పించి సకాలంలో డబ్బులు అందించాలన్నదే సర్కార్ లక్ష్యమని చెప్పారు. ఏ గ్రామంలో ఏ తప్పు జరిగిందో.. ఆడిట్ సిబ్బంది గుర్తిస్తున్నారని వివరించారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీలకు గాను సాయంత్రం వరకు కేవలం పది గ్రామాల వివరాలనే ఆడిట్ సిబ్బంది వెల్లడించారు.
గోప్యంగా ప్రజావేదిక సభ
ఈజీఎస్ సామాజిక తనిఖీ మండల ప్రజా వేదిక సభ మండల పరిషత్ సమావేశ మందిరంలో పెట్టడంపై కూలీలు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు అంజయ్య మాట్లాడుతూ.. ప్రజావేదిక సభ తేదీని ఈజీఎస్ అధికారులు గోప్యంగా ఉంచారన్నారు. గతంలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై ఎంత మంది మీద చర్యలు తీసుకున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పనులు చేసి రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు రావడం లేదని.. కూలీలు పనులు చేసి పస్తులుంటున్నారని.. పలుమార్లు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనలు, ధర్నాలు చేపట్టినా ఫలితం లేదన్నారు.
అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆందోళన
డీఆర్డీఓ శ్రీలత హామీతో శాంతించిన కూలీలు, ఆందోళన కారులు