
ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి
తుర్కయంజాల్: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ డిమాండ్ చేశారు. పురపాలక సంఘం పరిధిలోని తొర్రూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వారు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడంతో దళారులకు క్వింటా రూ.1,700 రైతులు అమ్ముకుని రూ.600 నష్టపోతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కరువయ్యాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు నోముల దయానంద్ గౌడ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బోసుపల్లి ప్రతాప్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి బచ్చిగళ్ల రమేష్, మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహా రెడ్డి, నాయకులు కందాల బల్‌దేవ్ రెడ్డి, పోరెడ్డి అర్జున్ రెడ్డి, కొత్త రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెకానిక్ షెడ్‌లో అగ్ని ప్రమాదం
● ఐదు కార్లు దగ్ధం ● రూ.20 లక్షల నష్టం
షాద్‌నగర్: మరమ్మతుల కోసం తీసుకువచ్చి న కారు నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించి ఐదు కార్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున షాద్‌నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఫరూఖ్‌నగర్ మండలం దూసకల్ గ్రామానికి చెందిన గణేష్ యాదవ్ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో జాతీయ రహదారి పక్కన మెకానిక్ షెడ్ నిర్వహిస్తున్నాడు. మరమ్మతుల కోసం వచ్చిన కార్లను షెడ్‌లోఉంచి తాళం వేసి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4గంటల ప్రాంతంలో షెడ్‌లో ఉన్న ఓ కారు బ్యాటరీ నుంచి మంటలు వ్యాపించి ఐదు కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని మంటలార్పారు. సుమారు రూ.20లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఫాంహౌస్‌లో హుక్కా పార్టీ
పోలీసుల అదుపులో పది మంది యువకులు, ఇద్దరు మైనర్లు
శంషాబాద్ రూరల్: ఫాంహౌస్‌లో హుక్కా పార్టీ జరుపుకుంటున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన కొందరు యువకులు గండిగూడ శివారులోని ఎంఆర్‌జీ ఫాంహౌస్‌లో హుక్కా పార్టీ చేసుకుంటున్నారు. మంగళవారం ఉదయం స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ చేసుకుంటున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సమాచారం. హుక్కా పరికరాలను స్వాఽధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి

ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి