సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో వినాయక లడ్డూ వేలంపాటలో రాంభగీచా మంటప్ రికార్డు నెలకొల్పింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన వేలం పాటలో కోమండ్ల అవ్యుక్త్‌రెడ్డి రూ.1,81,116 లకు ఆది దేవుడి ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగేలా చూడాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ సంపత్ కోరారు. ఎల్లారెడ్డిపేట పీహెచ్‌సీని శనివారం సందర్శించారు. డాక్టర్ సంపత్ మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరగాలన్నారు. వైద్యాధికారి అంజుం, హెచ్‌ఈవో బాలయ్య, నవీన పాల్గొన్నారు.
ఇన్‌చార్జి ఏజీపీగా కళ్యాణ్‌చక్రవర్తి
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల జూనియర్ సివిల్ కోర్టుల ఇన్‌చార్జి ఏజీపీగా కళ్యాణ్ చక్రవర్తి నియమితులయ్యారు. సిరిసిల్లలోని పీడీఎం మొదటి అదనపు, రెండో అదనపు, జూనియర్ సివిల్ కోర్టుల ఇన్‌చార్జి అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా టి.కళ్యాణ్ చక్రవర్తి నియమితులయ్యారు. ఈమేరకు సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతల వెంకటయ్య ప్రకటన విడుదల చేశారు.
సమష్టి కృషితో ప్రశాంతంగా నిమజ్జనం
సిరిసిల్ల: జిల్లాలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు సమష్టి కృషితో ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. సిరిసిల్లలో శనివారం వినాయకుల నిమజ్జన వేడుకలను పర్యవేక్షించి మాట్లాడారు. జిల్లాలో 2,200లకు పైగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం శాంతియుత వాతావరణంలో పూర్తి అయిందన్నారు. 11 రోజులపాటు 24 గంటలు క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సహకరించిన నిర్వాహకులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ పండుగలను ఇదే స్ఫూర్తితో జరుపుకోవాలని కోరారు.
చిరుజల్లులు
సిరిసిల్ల: జిల్లాలోని నాలుగు మండలాల్లో శనివారం చిరుజల్లులు కురిశాయి. బోయినపల్లిలో 2.4 మిల్లీమీటర్లు, వేములవాడరూరల్‌లో 1.4, వేములవాడలో 0.4, ఇల్లంతకుంటలో 0.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా అంతటా మేఘావృతమైంది. చిరుజల్లులతో వాతావరణ చల్లబడింది.
డ్రైనేజీ పనులు అడ్డగింత
వేములవాడ: వేములవాడ మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు చేపట్టిన 80 ఫీట్ల రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను స్థానికులు శనివారం అడ్డుకున్నారు. మహంకాళి ఆలయం సమీపంలో 80 ఫీట్ల రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇళ్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రైనేజీ నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చేపడుతున్న పనులతో తాము దాదాపు 10 ఫీట్ల వరకు స్థలం కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం రోడ్డు మధ్య నుంచి 35 ఫీట్లు విడిచి డ్రైనేజీ నిర్మించాలని టీపీబీవో వినోద్‌ను కోరారు. ఈ ఘటనపై ఎస్సై శ్రీనివాస్ వివరాలు అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


