● 60 ఏళ్ల కల త్వరలోనే నెరవేరబోతోంది ● మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్‌గౌడ్
సిరిసిల్ల అర్బన్ : ముదిరాజ్ కులస్తుల అభివృద్ధి, హక్కుల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, 60 ఏళ్ల కల త్వరలోనే నెరవేరబోతోందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన ముదిరాజ్ సింహగర్జన సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శాసన మండలి వైస్‌చైర్మన్ బండ ప్రకాశ్‌లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ పండగ సాయన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించేలా విగ్రహాల ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వేగంగా ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్‌గాంధీ విజన్ ప్రకారం సమగ్ర కులగణనను చేపట్టిందన్నారు. ముదిరాజ్‌లను బీసీ–డీ గ్రూప్ నుంచి బీసీ–ఏకు మార్చాలనే 60 ఏళ్ల కల త్వరలోనే నెరవేరబోతోందని స్పష్టం చేశారు. ఇప్పటికే 80 శాతం పూర్తయిందన్నారు. ముదిరాజ్‌ల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ చట్టసభల్లో సరైన అవకాశం దక్కడం లేదన్నారు.
రాజకీయ భాగస్వామ్యం పెరగాలి
– మంత్రి పొన్నం ప్రభాకర్
జనాభా ప్రాతిపదికన ముదిరాజ్‌లు చట్టసభల్లో, అసెంబ్లీ, పార్లమెంట్‌లలో అధిక సంఖ్యలో రాజకీయ భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వందేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణనతో రాష్ట్రంలో 26 లక్షలకుపైగా ముదిరాజ్‌ల జనాభా ఉందనే స్పష్టమైన నివేదికలు వచ్చాయన్నారు. ఈ డేటా బీసీ కమిషన్‌కు సమర్పించినట్లు తెలిపారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ కోరగా.. మంత్రి పొన్నం స్పందిస్తూ అడిగే హక్కు మనకు ఉందని.. ప్రధాని నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని ప్రకటించి జనగణనలో కులగుణన బీసీల అంశాన్ని చేరుస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని హితవు పలికారు. నేతన్నలు, గీతకార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ అందుతున్నట్లుగా ఇతర కులాల వృత్తిదారులకూ 50 ఏళ్లకే పెన్షన్ అందించే అంశాలపై కార్యాచరణ రూపొందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. ముదిరాజ్‌లకు సంబంధించిన అంశాన్ని బీసీ సంక్షేమశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తన వంతు కృషిచేస్తానన్నారు. ముది రాజ్ కుల ఆత్మగౌరవ భవనానికి రూ.5కోట్లు కేటా యిస్తున్నామని, కార్పొరేషన్‌కు 50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కులాల మధ్య విభేదాలు కాకుండా పరస్పరం సమస్యలు పరిష్కరించుకుంటూ బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శాసన మండలి వైస్‌చైర్మన్ బండ ప్రకాశ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము తదితరులు పాల్గొన్నారు.


