ఎనిమిది నెలల్లో 204 కేసులు రూ.1.19 కోట్ల సొత్తు చోరీ ఎల్లారెడ్డిపేటలో ఏటీఎంనే ఎత్తుకెళ్లారు హర్యానా దొంగలుగా గుర్తించి అన్వేషిస్తున్న పోలీసులు
‘ఇది ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలోని ఏటీఎం. పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఉన్న ఏటీఎంను ఏప్రిల్ 10న అర్ధరాత్రి దొంగలు గొలుసులతో కట్టి వాహనంతో లాగి ఎత్తుకెళ్లారు. ఏటీఎంలోని రూ.13లక్షలు దోచుకుని అక్కపల్లి అటవీప్రాంతంలో మిషన్‌ను వదిలివెళ్లారు. ఈ ఘటన జరిగిన నాలుగు నెలలు దాటినా.. దొంగలను పోలీసులు పట్టుకోలేక పోయారు.’
సిరిసిల్ల: జిల్లాలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలు జరుగుతున్నాయి. పొద్దంతా రెక్కీ నిర్వహిస్తూ.. రాత్రి వేళ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ జనవరి నుంచి ఆగస్ట్ 31 వరకు మొత్తం 244 రోజులు కాగా, జిల్లాలో 204 దొంగతనాలు జరిగాయి. అంటే సెలవు రోజులను మినహాయిస్తే జిల్లాలో రోజుకో చోరీ జరిగినట్లు భావిస్తున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ దొంగ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఆలయాల్లో దొరికిన సొత్తు అమ్ముకుంటూ జల్సాలు చేస్తున్నారు. గతంలో జైలుకు వెళ్లి వచ్చిన సదరు నిందితుడు స్నేహితులతో కలిసి మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డారు. ఆ దొంగల ముఠాను సిరిసిల్ల పోలీసులు పట్టుకుని జైలుకు పంపించారు. ఇటీవల కోనరావుపేట మండలం నిమ్మపల్లిలోనూ నాలుగు ఇళ్లలో దొంగలు పడ్డారు. ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లిలో ఆగస్ట్ మొదటి వారంలో మూడిళ్లలో దొంగలుపడ్డారు. మిట్టపల్లి రాజు ఇంటి తాళం పగులగొట్టి బీరువాను తెరిసి బంగారం, వెండి దోచుకెళ్లారు. అంతకు ముందు రెండిళ్లలో దొంగలు పడ్డారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రతి వారం రోజుల్లో నాలుగైదు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.
గొర్రెల మందలకు రక్షణ కరువు
జిల్లాలో గొర్రెల మందలు పొలాల దగ్గర, ఆరు బయట, దొడ్డిలో ఉంటాయి. ఇటీవల కాలంలో దొంగలు ట్రాలీ ఆటోల్లో వచ్చి గొర్రెలను ఎత్తుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. రాత్రి వేళల్లో రక్షణ లేకుండా ఉండే గొర్రెల మందల వద్దకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన తెల్లారేలోగా గొర్రెలను ఆటోలో వేసుకుని వెళ్లారు. వ్యవసాయ మోటార్లు, ఇతర వస్తువులు సైతం దొంగలపాలవుతున్నాయి. దొంగల బాధకు కొందరు కాపరులు గొర్రెల మందలు ఉండే ప్రదేశంలో సీసీ కెమెరాలు అమర్చి రాత్రి వేళ కాపలాగా నిద్రిస్తున్నారు.
నిద్రపోతున్న నిఘా నేత్రాలు
జిల్లాలో పోలీసులు సామాజిక బాధ్యతగా ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులు, గ్రామాల్లో అంతర్గత రహదారుల వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించి నిఘా ఉంచారు. కాగా, ఇటీవల కాలంలో చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు సరిగా పని చేయకపోవడం, సాంకేతిక సమస్యలు రావడంతో మళ్లీ రిపేరు చేయక నిఘా నిద్రపోతుంది. అనేక ప్రాంతాల్లో చాలా రోజుల కిందట బిగించిన సీసీ కెమెరాల కళ్లు మసకబారి పోయి, దుమ్ము పట్టి నేలచూపులు చూస్తున్నాయి. అవి బాగా పని చేస్తే.. కనీసం నిఘా నీడలో నేరాలను నియంత్రించేందుకు అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు బాగానే పని చేస్తున్నాయి. మరోవైపు వ్యక్తిగతంగా ప్రైవేటు వ్యక్తులు, వ్యాపార వర్గాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం విశేషం. కానీ, పాడైన కెమెరాలను రిపేరు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు జిల్లాలో జరిగిన చోరీలు
నమోదైన దొంగతనాలు: 204
కోల్పోయిన సొత్తు: రూ.1,19,68,281
దొంగలు దొరికిన కేసులు: 93
రికవరీ సొత్తు: రూ.20,81,820
పట్టుబడని దొంగతనం కేసులు: 111
రికవరీ కాని సొత్తు: 98,86,461
‘ఇది కోనరావుపేట మండలం శివంగళపల్లె. ఓ ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లగా.. ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి ఘటన స్థలానికి వెళ్లి విచారించారు. అప్పటి సీఐ, ఎస్సై సైతం క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. ఇదే మండలంలోని మర్తనపేటలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను పట్టుకునేందుకు జాగిలాలతో అన్వేషించారు.’
జిల్లాలో..
గ్రామాలు 260
గ్రామీణ పోలీస్‌స్టేషన్లు 11
పట్టణ పోలీస్‌స్టేషన్లు 02
గ్రామీణ సర్కిళ్లు 04
డివిజన్లు 02
ఏటీఎం దొంగలను గుర్తించాం
ఎల్లారెడ్డిపేటలో ఏటీఎం దోపిడీకి పాల్పడిన దొంగలను గుర్తించాం. హర్యానాకు చెందిన వారిగా గుర్తించి పోలీసు బృందం అక్కడి వరకు వెళ్లింది. దొంగలు ఇంకా పట్టుబడలేదు. వారి కోసం అన్వేషణ కొనసాగుతుంది. జిల్లాలో దొంగతనాల కట్టడికి పోలీస్ పెట్రోలింగ్ పెంచాం. శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– మహేశ్ బి గీతే, ఎస్పీ


