సిరిసిల్ల: జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు తుంపర వానలు పడ్డాయి. బోయినపల్లిలో అత్యధికంగా 14.6 మిల్లీమీటర్ల వర్షం పడగా.. రుద్రంగి 5.9, చందుర్తి 11.9, వేములవాడరూరల్ 7.0, వేములవాడ 6.2, సిరిసిల్ల 0.7, కోనరావుపేట 8.0, వీర్నపల్లి 0.4, ఎల్లారెడ్డిపేట 3.3, ముస్తాబాద్ 0.8, తంగళ్లపల్లి 6.1, ఇల్లంతకుంటలో 2.5 మి.మీ వర్షం కురిసింది. గంభీరావుపేటలో పెద్దగా వర్షం పడలేదు. జిల్లాలో సగటు వర్షపాతం 5.2 మిల్లీ మీటర్లుగా నమోదైంది. రుద్రంగి మండలంలో లోటు వర్షపాతం ఉండగా, వేములవాడ, కోనరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో కాస్త మెరుగైన వర్షం కురిసింది.
విజయవంతం చేయాలి
వీర్నపల్లి(సిరిసిల్ల): ప్రభుత్వం మారినా ప్రజలకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలే గ్రామాల్లో భరోసాగా నిలుస్తున్నారని, అదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ఆదివారం వీర్నపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయిన తీరుపై, ప్రభుత్వం 1,000 రోజులుగా అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు చేపట్టే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, మాల్లరపు అరుణ్‌కుమార్, ఎండీ చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.


