సిరిసిల్ల: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఐదుగురు సభ్యుల బృందం సెప్టెంబరు 1న జిల్లాకు రానున్నట్లు జిల్లా అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబునాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్ కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా అధికారులతో సమీక్షించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ
సిరిసిల్లఅర్బన్: హైదరాబాద్ జింఖానా గ్రౌండ్‌లో ఇటీవల జరిగిన అథ్లెటిక్స్ మీట్‌లో మాస్టర్ అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబర్చి పతాకాలు సాధించారు. 65 ఏళ్ల విభాగంలో మల్యాల లక్ష్మి 3 కిలోమీటర్ల వాక్‌లో గోల్డ్ మెడల్, 400 మీటర్లలో సిల్వర్ మెడల్ సాధించారు. 35 ఏళ్ల విభాగంలో కె.అశోక్ డిస్క్ వాక్‌లో గోల్డ్ మెడల్, 1,500 మీటర్లలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. 35 ఏళ్ల విభాగంలో సుల్తానా డిస్క్‌వాక్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. విజేతలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ గొట్టిముక్కుల శేఖర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జ్ఞానోభా, రామానుజమ్మ, గొట్టె అంజయ్య అభినందించారు.
సిరిసిల్ల నుంచి జేబీఎస్‌కు ప్రత్యేక బస్సులు
సిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల ఆర్టీసీ డిపో నుంచి జేబీఎస్(జూబ్లీ బస్ స్టేషన్)కు ప్రత్యేక రిజర్వేషన్ ఎక్స్‌ప్రెస్ బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ప్రకాశ్‌రావు తెలిపారు. ఈ నెల 31 సోమవారం నుంచి బస్సులు నడుస్తాయన్నారు. సిరిసిల్ల నుంచి ఉదయం 5 గంటలకు ప్రారంభమై ప్రతీ అరగంటకు ఒకటి చొప్పున ఉదయం 8.15 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేక రిజర్వేషన్ బస్సులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించాలి
తంగళ్లపల్లి: మండలంలోని మండెపల్లి గ్రామంలో సర్వే నంబర్ 377లో భూములు కోల్పోయిన సుమారు 200 కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని సీపీఐ నాయకుడు గుంటి వేణు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదల జీవనోపాధి కోసం సుమారు 350 ఎకరాలు కేటాయించారని, అందులో అధిక శాతం దళిత కుటుంబాలే ఉన్నాయన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆ భూములను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు వాడుకుందే తప్ప బాధితులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. పైగా కొన్ని భూములను కొనుగోలు చేశామంటూ బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అవసరాలకు వినియోగించిన భూములకు ఎకరానికి రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. వీలైన చోట భూములను తిరిగి లబ్ధిదారులకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సోమ నాగరాజు, ఎలగందుల రాజు పాల్గొన్నారు.
‘చేయూత’ గడువు పెంచాలి
సిరిసిల్లటౌన్: చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పెంచాలని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి డిమాండ్ చేశారు. ఆదివారం సిరిసిల్ల లోని కార్మికభవనంలో లాల్ బహుట చేనేత, పవర్‌లూమ్స్ కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేనేత జౌళిశాఖ అధికారులు, సిబ్బంది తీరుతో సిరిసిల్ల పవర్లూమ్, అనుబంధ రంగాల కార్మికులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. దరఖాస్తు గడువు ముగుస్తున్నా జౌళిశాఖ అధికారులు నేతన్న చేయూత పథకానికి అవసరమైన కార్డులు జారీ చేయడం లేదన్నారు. దీంతో కార్మికులకు నష్టం జరిగే అవకావం ఉందన్నారు. అధికారులు తమ పని విధానాన్ని మార్చుకోకుంటే పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. అజ్జ వేణు, సోమ నాగరాజు, హరికృష్ణ, రాజమల్లు పాల్గొన్నారు.


