కోనరావుపేట(వేములవాడ): గ్రామంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న మద్యం అమ్మకాలను అరికట్టేందుకు పంచాయతీ పాలకవర్గం తీసుకున్న మద్యపాన నిషేధం నీరుగారుతోంది. కోనరావుపేట మండలం కొండాపూర్‌లో మద్యం విక్రయాలు చేపట్టకూడదని పంచాయతీ పాలకవర్గం ఏకాభిప్రాయానికి వచ్చి సర్పంచ్ వంకాయల గౌతమి ఆధ్వర్యంలో మార్చి 1న గ్రామసభ నిర్వహించి అందరి సమక్షంలో మద్యపాన నిషేధానికి తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మినవారికి రూ. 10వేల జరిమానా, పట్టించిన వారికి రూ.5 వేల నజరానా ప్రకటించారు. కాగా గ్రామంలో ఆది వారం పోచమ్మ బోనాల పండుగను పురస్కరించుకొని బెల్ట్‌షాపు నిర్వాహకులు మద్యపాన నిషేధం తీర్మానాన్ని తుంగలో తొక్కుతూ మద్యం అమ్మకాలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించొద్దంటూ నిర్వాహకులను గ్రామస్తులు నిలదీసినా అమ్మకాలు ఆపడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బెల్ట్‌షాప్ నిర్వాహకులపై ఎకై ్సజ్, పోలీస్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


