గంభీరావుపేట(సిరిసిల్ల): గ్రామ పంచాయతీలకు ఆర్థికపరమైన స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లు నేరుగా గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు మాత్రమే నేరుగా గ్రామపంచాయతీల ఖాతాలకు చేరుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వ నిధులు ట్రెజరీ వ్యవస్థ ద్వారా బిల్లుల ఆధారంగా విడుదలయ్యేవి. దీంతో అభివృద్ధి పనులు, కార్మికుల వేతనాలు, నిర్వహణ ఖర్చుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండేది. ఈ నిర్ణయంతో జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో సమస్యలకు చెక్ పడనుంది.
ఇకపై జాప్యం జరుగదు
ట్రైజరీ విధానంతో పంచాయతీలు ప్రతీ ఖర్చుకు బిల్లులు సమర్పించి అధికారుల అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. నిధుల విడుదల ఆలస్యం కావడంతో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ ఇతర గ్రామాభివృద్ధి పనులు నిలిచిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు ప్రతిపాదించిన మొత్తాలకు కోత విధించి నిధులు విడుదల కావడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి.
అభివృద్ధి పనులకు ఊతం
ఇకపై నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ కావడంతో అవసరమైన పనులను వేగంగా చేపట్టే అవకాశం లభించనుంది. కార్మికుల వేతనాల చెల్లింపులు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు, అత్యవసర పనుల నిర్వహణలో ఆలస్యం తగ్గనుందని అధికారులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు.
పారదర్శకతకు ప్రాధాన్యం
నిధుల వినియోగంపై గ్రామపంచాయతీలకు అధిక స్వేచ్ఛ లభిస్తున్న నేపథ్యంలో అడిట్ వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. నిధుల వినియోగం, లెక్కల నిర్వహణపై ప్రభుత్వం త్వరలో సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో గ్రామపంచాయతీల ఆర్థిక వ్యవహారాల్లో స్వయం ప్రతిపత్తి పెరగడంతో పాటు గ్రామీణాభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగే అవకాశాలు మెరుగుపడనున్నాయి.


