12 ఏళ్ల పాలనపై విచారణ
సహకార చట్టం–51 ప్రకారం ముందుకు..
విచారణ అధికారిగా జగిత్యాల డీసీవో మనోజ్‌కుమార్
ఇప్పటికే వ్యాపార లైసెన్స్ రద్దు
ఎన్‌పీడీసీఎల్‌కు వ్యాపార లైసెన్స్ జారీ
తప్పులను చూపి.. ఎత్తివేసే యోచన
12 ఏళ్లలో ఏం జరిగింది ?
రికార్డులు లభించేనా ?
సిరిసిల్ల: ఒకప్పటి సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో 56 ఏళ్లుగా విద్యుత్ పంపిణీ సేవలు అందించిన సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)కు పద్ధతి ప్రకారం ఉచ్చు బిగించేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. సిరిసిల్ల ‘సెస్’ విద్యుత్ పంపిణీ లైసెన్స్‌ను 2026 మార్చి 31న పునరుద్ధరించకుండా.. నిలిపివేసి విద్యుత్ పంపిణీ బాధ్యతలను ఎన్‌పీడీసీఎల్‌కు అప్పగించింది. తాజాగా వ్యాపార బాధ్యతలను ఎన్‌పీడీసీఎల్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో సహకార చట్టం ప్రకారం ఎన్నికై న ‘సెస్’ పాలకవర్గం ఉండగా.. పాలకవర్గం జోలికి వెళ్లకుండా ఆ సంస్థ ఉద్యోగులను స్వాధీనం చేసుకుని విద్యుత్ పంపిణీ సేవలు అందిస్తోంది.
‘సెస్’ 12 ఏళ్ల పాలనపై విచారణకు ఆదేశాలు
జిల్లాలో ‘సెస్’ సంస్థ 12 ఏళ్ల పరిపాలనపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2014 నుంచి 2026 వరకు ‘సెస్’ పరిధిలో జరిగిన అన్ని పరిపాలనాపరమైన నిర్ణయాలపై సహకార చట్టం–51 ప్రకారం విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ ఎండీ తిరుపతి మెమో నంబరు : 144/2026 తేదీ: 20.06.2026న జారీ చేశారు. దీని ప్రకారం 12 ఏళ్లలో ‘సెస్’ పాలకవర్గాలు తీసుకున్న అన్ని నిర్ణయాలపై విచారణ చేపట్టనున్నారు. విచారణ అధికారిగా జగిత్యాల జిల్లా సహకార అధికారి సీ.హెచ్.మనోజ్‌కుమార్‌ను నియమించారు. బైలాస్, సర్వీస్ కండీషన్స్, ఉద్యోగుల నియామకాలు, మహాసభ మినిట్స్, డే బుక్స్, పేబిల్స్, విద్యుత్‌పరికరాల పర్ఛేజ్ రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లు, ఫైనల్ ఆడిట్ రిపోర్టులు, పేమెంట్ ఓచర్లు, అన్ని బ్యాంకుల్లోని కరెంట్ అకౌంట్స్, సేవింగ్ అకౌంట్స్‌ను పరిశీలించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ‘సెస్’ పాలకవర్గాలు, మేనేజింగ్ డైరెక్టర్ల వివరాలతోపాటు సిబ్బంది జీతభత్యాల చెల్లింపులు, పనిచేసిన స్థలాలను 2014 నుంచి 2026 వరకు ఉన్న వివరాలతో విచారణ చేయాలని ఆదేశించారు.
సహకార చట్టం–51 ప్రకారం
సహకార సంఘాల నిర్వహణలో ఏమైనా అక్రమాలు, అవకతవకలు జరిగితే.. తెలంగాణ సహకార సొసైటీస్ యాక్ట్ 1964, సహకార చట్టం–51 ప్రకారం విచారణ చేపడతారు. దీని కోసం సహకార శాఖ ప్రత్యేక కమిషనర్ ఆర్‌సీ నంబరు 7646/2025 పీఈ, తేదీ 26.05.2026 ద్వారా ఆదేశాలు జారీ చేశారు. అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తే పాలకవర్గాన్ని రద్దు చేయడంతోపాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం దుర్వినియోగమైన సొమ్మును తిరిగి వసూలు చేసే అవకాశం ఉంటుంది. 2007–2010 మధ్య కాలంలోనూ సహకార చట్టం 51 ప్రకారం గతంలో ‘సెస్’ లావాదేవీలపై విచారణ జరగ్గా.. అప్పటి ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు కోర్టును ఆశ్రయించి విచారణను నిలుపుదల చేయించారు. తాజాగా మరోసారి 12 ఏళ్ల ‘సెస్’ పరిపాలనపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
2014 ఫిబ్రవరిలో కేతిరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి చైర్మన్‌గా, పాత సత్యలక్ష్మి, పత్తిపాక లక్ష్మీరాజం సభ్యులుగా త్రీమెన్ కమిటీని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కమిటీని జూన్‌లో రద్దు చేసింది. ఆ తరువాత గూడూరి ప్రవీణ్ చైర్మన్‌గా అప్పటి ప్రభుత్వం నియమించగా కోర్టు జోక్యంతో ఆ కమిటీ రద్దయింది. 2016లో జరిగిన ‘సెస్’ ఎన్నికల్లో దోర్నాల లక్ష్మారెడ్డి చైర్మన్, లగిశెట్టి శ్రీనివాస్ వైస్‌చైర్మన్‌గా పాలకవర్గం ఏర్పాటైంది. 2022 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో చిక్కాల రామారావు ‘సెస్’ చైర్మన్, దేవరకొండ తిరుపతి వైస్ చైర్మన్‌గా పాలకవర్గం ఏర్పాటు అయింది. ఆ పాలకవర్గం పదవీకాలం మరో 18 నెలలు ఉండగానే ‘సెస్’ లైసెన్స్‌ను రెన్యూవల్ చేయకుండా ఎన్‌పీడీసీఎల్‌కు వ్యాపార బాధ్యతలు అప్పగించారు.
12 ఏళ్ల ‘సెస్’ పాలనపై విచారణకు ఆదేశించగా.. రికార్డుల సమర్పణ సాధ్యమవుతుందా? అనే సందేహాలు ఉన్నాయి. నిజానికి ‘సెస్’ రికార్డులు 2023 నవంబరు 12న దీపావళి పండుగ సందర్భంగా జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. కంప్యూటర్ గది, వర్క్ ఆర్డర్ల రికార్డులు కాలిపోయాయి. సంస్థకు సంబంధించిన విలువైన రికార్డులు కాలిపోయినట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ కారణంగా ఇప్పుడు జరిగే సహకార చట్టం 51 విచారణకు రికార్డుల లభ్యతపై అనుమానాలు ఉన్నాయి. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫర సంఘం(సెస్) తాజా పాలకవర్గానికి ఉచ్చు బిగించి సంస్థను రద్దు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.


