● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్‌ఏ(బూత్ లెవల్ ఏజెంట్)ల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణ, రూరల్ పరిధి బూత్ లెవల్ ఏజెంట్ల(బీఎల్‌ఏ)కు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్)పై శుక్రవారం అవగాహన కల్పించారు. ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల సంఘం అనుమానాస్పద లేదా పరిశీలన జాబితాలో చేర్చిన ఓట్లకు సంబంధించి ఆయా ఓటర్లకు బీఎల్‌ఏలు సమాచారం అందించాలన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టాలన్నారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పురిటిగడ్డ రుణం తీర్చుకునేందుకు ఇప్పటికే పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరిగిందని, భవిష్యత్‌లోనూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఎమ్మెల్యే స్వగ్రామం కోరుట్లపేటకు శుక్రవారం వచ్చారు. ఈ సందర్భంగా మండలంలోని కాంగ్రెస్ నాయకులు కోరుట్లపేటకు వెళ్లి ఎమ్మెల్యేను కలిసి ఈ ప్రాంతంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్‌ల ఫోరం మండల కన్వీనర్ దొమ్మాటి నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్‌రెడ్డి, నాయకులు నంది కిషన్, గుండాడి రామ్‌రెడ్డి, గుర్రాల రాజిరెడ్డి, గూడ విజయరెడ్డి, నారాయణరెడ్డి, సత్యంరెడ్డి పాల్గొన్నారు.
మద్దిమల్ల రాయినిచెరువు కబ్జా
వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి మండలం మద్దిమల్లలోని రాయినిచెరువు ఆక్రమణకు గురవుతోంది. దాదాపు 43 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును కబ్జా చేస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాయినిచెరువు శిఖం పరిధిలోని పట్టాభూమిని చదును చేసే నెపంతో ఒకరు అక్రమాలకు తెరలేపారు. చెరువులోపల మట్టిని, బండరాళ్లను తెచ్చి పోస్తున్నారు. ఈ కబ్జాతో చెరువు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోవడమే కాకుండా, నీటి నిల్వ సామర్థ్యం ప్రమాదంలో పడుతోందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో చెరువు నీటిపై ఆధారపడిన తమ వ్యవసాయ భూములు ఎండిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు.
క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి
రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు స్పందించి చెరువు సరిహద్దులను మళ్లీ గుర్తించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చెరువు స్థలంలో రాళ్లు, మట్టి పోసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై నీటిపారుదలశాఖ అధికారి కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. చెరువు కబ్జాకు గురైన విష యం వాస్తవమేనని తెలిపారు. చెరువు గర్భంలో వేసిన రాళ్లను ఇప్పటికే తొలగించామని తెలిపారు. చెరువును ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వేములవాడరూరల్: నకిలీ స్టాంపుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే కొంతమంది నకిలీ స్టాంపులను సృష్టించి వివిధ రకాల మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. వీటితోపాటు వేములవాడరూరల్ మండలంలో పలు గ్రామాల పంచాయతీల కార్యదర్శుల పేరుతో మరికొన్ని నకిలీస్టాంపులు ఉన్నట్లు సమాచారం. గ్రామాలవారీగా నకిలీస్టాంపులను తయారు చేసిన ఓ ముఠా ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. గ్రామపంచాయతీ కార్యదర్శి పేరుతో చాలా గ్రామాల స్టాంపులను తయారుచేసి మోసాలకు పాల్పడినట్లు సమాచారం. రెండు రకాల స్టాంపులు ఒకే గ్రామపంచాయతీ పేరుపై తయారుకావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


