నాంపల్లి సిగలో పర్యాటక నగ | - | Sakshi
Sakshi News home page

నాంపల్లి సిగలో పర్యాటక నగ

Jun 27 2026 2:07 AM | Updated on Jun 27 2026 2:07 AM

ఇప్పటికే ఆకట్టుకుంటున్న కాళీయమర్ధనం త్వరలో అందుబాటులోకి ఎయిర్‌ఫోర్స్‌ విమానం భక్తులకు ఆధ్యాత్మికం.. ఆహ్లాదం

వేములవాడఅర్బన్‌: చుట్టూ పచ్చనిచెట్లు.. ఓ వైపు మిడ్‌మానేరు జలసోయగం.. మరోవైపు ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడ పట్టణంతో నాంపల్లిగుట్ట ఆధ్యాత్మికంగా.. పర్యాటకంగా ఆకట్టుకుంటుంది. దీనికితోడు తాజాగా గుట్టపైన ఎయిర్‌ఫోర్స్‌ విమానాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తయితే గుట్టకు మరింత అందం చేకూరనుంది. రాజన్న అనుబంధ ఆలయమైన నాంపల్లిగుట్టపై వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రాక పెరిగింది. భక్తులకు గుట్టపై ఆహ్లాదం పంచేందుకు ఇప్పటికే కాళీయమర్ధనం ఉండగా తాజాగా ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఏర్పాటు చేయనున్నారు.

గరుడ వాహనంపై ఊరేగింపు

శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో పలు చోట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆయా సమయాల్లో స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగిస్తుంటారు. పక్షులకు రాజైన గరుడవాహనంపై స్వామివారిని ఊరేగించడం భక్తులకు కనువిందు చేస్తుంది. ఈక్రమంలోనే నాంపల్లిగుట్టపై గాలిలో వెళ్లే లోహపు పిట్ట(విమానం) ఏర్పాటు చేస్తున్నారని స్థానిక పెద్దలు చర్చించుకుంటున్నారు.

గుట్టపై కాళీయమర్ధనం

అప్పటి ఎంపీ విద్యాసాగర్‌రావు హయాంలో నాంపల్లిగుట్ట అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్‌ నిధులు వెచ్చించారు. ఘాట్‌రోడ్డు, కాళీయమర్ధనం, వాటర్‌ ఫౌంటేయిన్లు ఏర్పాటు చేశారు. గుట్టపై ఏర్పాటు చేసిన కాళీయమర్ధనం ఆకర్షణీయంగా నిలిచింది. ఐదు తలల నాగుపాముపై కృష్ణుడు పిల్లనగోవితో అందంగా కనిపిస్తున్నాడు. ఈ కాళీయమర్ధనం లోపల వివిధ రకాల బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. అందులోని నాగదేవతకు పాలు పోస్తుంటారు.

ఎయిర్‌ఫోర్స్‌ విమానం.. అదనపు ఆకర్షణ

నాంపల్లిగుట్టపై భక్తులకు ఆహ్లాదం పంచేందుకు వీటీడీఏ అధికారులు రెండేళ్లుగా ఎయిర్‌ఫోర్స్‌ విమానం ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేస్తున్నారు. ఎట్టకేలకు గుట్టపైకి ఎయిర్‌ఫోర్స్‌ విమానాన్ని తీసుకొచ్చారు. గుట్టపై ఉన్న లడ్డూ కౌంటర్‌ వద్ద స్థలం ఎక్కువగా ఉండటంతో అక్కడే విమానం ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్‌ఫోర్స్‌ విమానం బాడీ, విడిభాగాలను రెండు ట్రక్కుల ద్వారా తీసుకొచ్చి గుట్టపై ఉంచారు. వాటి పనులు ప్రారంభించి పూర్తి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విమానం లోపల ఇంజిన్‌ తప్ప మిగతా అన్ని భాగాలను ఏర్పాటు చేసి లోపలకు సందర్శకులను పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ విమానాన్ని చూసేందుకు స్థానికులు గుట్టపైకి వస్తున్నారు. త్వరలోనే ఏర్పాటు పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement