సిరిసిల్ల: యువత మత్తు వీడి.. మైదానాల బాట పట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. జిల్లా కేంద్రంలో పోలీస్ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. అంబేడ్కర్‌చౌరస్తా వద్ద కలెక్టర్, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యానగర్‌లోని పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన అవగాహన సదస్సులో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. పోలీసులు శాంతిభద్రతలతోపాటు సామాజిక బాధ్యతగా డ్రగ్స్ వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నారని అభినందించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ యువత, విద్యార్థులు నచ్చిన అంశాల్లో రాణించాలని సూచించారు. డ్రగ్స్‌కు బానిస కావద్దన్నారు. డ్రగ్స్ వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్ సమాచారాన్ని ఈగల్ ఫోర్స్ టోల్ ఫ్రీ నంబర్ 1908, కంట్రోల్ రూం నంబర్ 8712671111, 112 నంబర్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్డీవో శ్రీధర్‌బాబు, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, ఎస్‌బీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా రవాణాశాఖ అధికారి డి.శ్రీనివాస్, తహసీల్దార్ మహేశ్, సీఐ శ్రీనివాస్, మొగిలి, వెంకటేశ్, వీరప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన
విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు ఆకట్టకున్నాయి. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. వివిధ స్టాళ్లను అతిథులు పరిశీలించారు. ‘సే నో టు డ్రగ్స్.. సే ఎస్ టు లైఫ్’ నినాదాలు చేశారు.


