చిక్కేనా? | - | Sakshi
Sakshi News home page

చిక్కేనా?

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

అపెరల్‌ పార్క్‌ గోదాముల్లో అన్వేషణ

22 గోదాముల్లో 43 వేల టన్నుల వడ్లు

1,325 లారీల ధాన్యం లెక్కల్లో అధికారులు

అదనపు కలెక్టర్‌ పర్యవేక్షణలో బస్తాల గణన

ఆంధ్రకు చేరిన దారిమళ్లిన లారీలు

తెప్పించే పనిలో పోలీసులు

రికార్డులు సరిచూసుకుంటున్న అధికారులు

ధాన్యం లెక్క

సిరిసిల్ల: ధాన్యం దొంగలు చిక్కినా.. వడ్ల బస్తాల లెక్కలు తీసే పనిలో జిల్లా అధికారులు పడ్డారు. గోదాముల్లో నుంచి ఎంత ధాన్యం తరలిపోయేందో లెక్క తీస్తున్నారు. 1,325 లారీల్లో ధాన్యాన్ని సిరిసిల్ల శివారులోని అపెరల్‌ పార్క్‌ 22 గోదాముల్లో నిల్వచేశారు. నిల్వచేసిన బస్తాలు 10.60 లక్షలు. ఇది సుమారు 43వేల టన్నుల ధాన్యం. ఈ ధాన్యం బస్తాలను లెక్కించే పనిలో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు.

3,66,963.020 టన్నుల ధాన్యం

జిల్లాలోని 236 కొనుగోలు కేంద్రాల ద్వారా రెండు నెలలపాటు అధికారులు శ్రమించి 3,66,963.020 టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 36 పారాబాయిల్డ్‌, మరో 9 ‘రా’ రైస్‌ మిల్లులకు 3 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని తరలించారు. మిల్లులకు సరఫరా చేసిన వడ్లకు సంబంధించిన బాధ్యులు రైస్‌మిల్లర్లు కావడంతో అది ఇబ్బంది లేదు. కానీ అపెరల్‌పార్క్‌లో నిల్వచేసిన ధాన్యం పక్కదారి పట్టడంతో ప్రజాధనం ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్లింది. 13 లారీల వడ్లను దారి మళ్లించి రూ.91లక్షలను ప్రబుద్ధులు కాజేసి జైలు పాలయ్యారు.

అదనపు కలెక్టర్‌ పర్యవేక్షణలో ధాన్యం బస్తాల లెక్క

అపెరల్‌పార్క్‌లోని 22 గోదాముల్లో నిల్వ ఉన్న వడ్లబస్తాలను ఒక్కొక్కటిని అధికారులు లెక్కిస్తున్నారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ పర్యవేక్షణలో సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి బుచ్చిబాబు, భూసేకరణ విభాగం ప్రత్యేక ఉప కలెక్టర్‌ కుమారస్వామి, మెప్మా అధికారి ఫసత్‌ అలీబేగ్‌ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ధాన్యం బస్తాల లెక్కింపు మొదలైంది. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ హమాలీలు ధాన్యం బస్తాలను నెట్‌(క్రమపద్ధతిలో) కొట్టగా.. ఆ బస్తాల లెక్కలు సులభంగానే నమోదు చేస్తున్నారు. కానీ స్థానిక హమాలీలు చిందరవందరగా బస్తాలను నిల్వ చేయడంతో వాటిని మళ్లీ నెట్‌ కొట్టి, లెక్కించాల్సి వస్తోంది. మొత్తం నిల్వలను లెక్కిస్తే సేకరించిన ధాన్యంలో ఏమేరకు పక్కదారి పట్టాయో తెలుస్తోందని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చేరిన ఐదు లారీలు

సిరిసిల్ల అపెరల్‌ పార్క్‌లోని ధాన్యాన్ని అపహరించిన ఐదు లారీలు ఆంధ్రప్రదేశ్‌కు చేరినట్లు అధికారులు గుర్తించారు. రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని అపెరల్‌పార్క్‌లో దింపినట్లుగా ఆన్‌లైన్‌ రికార్డుల్లో నమోదు చేసిన అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఏకంగా లారీల్లోని మొత్తం వడ్లను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఈ అక్రమంలో భాగస్వాములైన లారీ డ్రైవర్లు, ఓనర్లను విచారించగా.. ఆ లారీలు ప్రస్తుతం ఏపీలో ఉన్నట్లు తేలింది. వాటిని వెనక్కి రప్పించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే ధాన్యాన్ని దారి మళ్లించిన కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసి రూ.18.16 లక్షల నగదును రికవరీ చేశారు. మరో రూ.46.21లక్షలను వివిధ బ్యాంకు ఖాతాల్లో పోలీసులు ఫ్రీజ్‌ చేశారు. పొరుగు రాష్ట్రానికి చేరిన లారీలను జిల్లాకు తెప్పించేందుకు జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు.

జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులను రైతులు సాధించారు. 3,66,963.020 టన్నుల ధాన్యాన్ని జిల్లా అధికారులు రెండు నెలలపాటు శ్రమించి సేకరించారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, లారీల యజమానులు, కొనుగోలు కేంద్రాల బుక్‌కీపర్లు, రైస్‌మిల్లర్లు కలిసి సేకరించిన ధాన్యాన్ని దారి మళ్లించారు. దీంతో రికార్డులను సరిచూసుకుంటూ ధాన్యం సేకరణలో లోపాలను గుర్తించే పనిలో పడ్డారు. కోనరావుపేట మండలం మరిమడ్ల, కొలనూర్‌కు చెందిన మూడు లారీ ట్రక్‌షీట్లను పోలీస్‌స్టేషన్‌ నుంచి తెప్పించిన అధికారులు ఆ ట్రక్‌షీట్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో వడ్ల డబ్బులు వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం కొను‘గోల్‌మాల్‌’లో పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడంతో లెక్కలను పక్కాగా తీసే పనిలో అధికారులు ఉన్నారు. ఏది ఏమైనా.. లోతుగా విచారిస్తే.. మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement