ప్రైవేట్‌ స్కూల్‌ వ్యాన్లు అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ స్కూల్‌ వ్యాన్లు అడ్డగింత

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

● రూ.5వేలు జరిమానా అంటూ హెచ్చరికలు

బండలింగంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పిస్తున్న తల్లిదండ్రులు

తడగొండలో ప్రైవేటు పాఠశాల

వ్యాన్‌ను అడ్డుకున్న గ్రామస్తులు

ఇల్లంతకుంట/బోయినపల్లి/ఎల్లారెడ్డిపేట: ఇల్లంతకుంట మండలం రహీంఖాన్‌పేట, బోయినపల్లి మండలం విలాసాగర్‌, తడగొండల్లో గ్రామస్తులు ప్రైవేట్‌ స్కూల్‌ వ్యాన్లను అడ్డుకోగా.. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో కొత్తగా 15 మంది విద్యార్థులు ప్రైవేట్‌ బడి నుంచి సర్కార్‌ బడిలో చేరారు. రహీంఖాన్‌పేటలో మూడేళ్లుగా మూతపడ్డ బడిని సర్పంచ్‌ కమటం లావణ్య ముందుండి తెరి పించారు. గ్రామం నుంచి ఎవరూ కూడా ప్రైవేట్‌ స్కూల్‌కు వెళ్లొద్దంటూ ప్రైవేట్‌ స్కూల్‌ వ్యాన్లను అడ్డుకున్నారు. ఏఎస్సై బాల్‌రెడ్డి అక్కడికి చేరుకొని గ్రామపంచాయతీ తీర్మానం ప్రకారం నడుచుకోవాలని ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు సిబ్బందికి సూచించి పంపించి వేశారు. ప్రైవేట్‌ బస్సుల నిర్వాహకులు గ్రామంలోని విద్యార్థులను తీసుకెళ్తే రూ.5వేలు జరిమానా విధిస్తామని తీర్మానించారు. కమటం రాములు, వార్డు సభ్యులు దొంతి అశోక్‌ , రవి, కూస రవి, నాగుల సాయి, గ్రామస్తులు కమటం దశరథం, లస్మయ్య, తాడూరు రవి పాల్గొన్నారు.

తడగొండలో 17 మంది విద్యార్థుల చేరిక

బోయినపల్లి మండలం తడగొండ, విలాసాగర్‌లలో సర్పంచులు ఉయ్యాల శ్రీనివాస్‌, ఏనుగుల కనకయ్యల ఆధ్వర్యంలో ప్రైవేట్‌ బస్సులను అడ్డుకున్నారు. తడగొండ గ్రామస్తులు ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో కొత్తగా 17 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరినట్లు సర్పంచ్‌ ఉయ్యాల శ్రీనివాస్‌ తెలిపారు. ఉపసర్పంచ్‌ చేపూరి వెంకటేశ్‌ తన కూతురిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఏఎంసీ డైరెక్టర్‌ గుడి రాజశేఖర్‌రెడ్డి, నాయకులు బుర్ర సోము, ఎండీ.హుస్సేన్‌, కట్ట ప్రవీణ్‌, గోగూరి చంద్రారెడ్డి, సింగరి వెంకటేశ్‌, వీరన్న, మహేందర్‌ పాల్గొన్నారు.

ప్రైవేట్‌ నుంచి 15 మంది..

ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి, రాచర్లగొల్లపల్లి, రాజన్నపేటల్లో ప్రైవేటు పాఠశాలల నుంచి 15 మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు. ఆయా గ్రామాల సర్పంచులు కొండ రమేశ్‌గౌడ్‌, క ల్లూరి బాపురెడ్డి, బాలరాజు నర్సాగౌడ్‌ మాట్లాడు తూ ప్రభుత్వ బడుల్లో చేరే విద్యార్థులకు సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాజన్నపేట ఉపసర్పంచ్‌ ఊడుగుల యాదగిరి తన కుమారుడు మహేశ్వర్‌ను ప్రభుత్వ బడిలో చేర్పించారు.

ప్రైవేటు స్కూల్‌ వాహనాలు నిషేధం

మండలంలోని బండలింగంపల్లిలోకి ప్రైవేట్‌ స్కూళ్ల బస్సులు, ఆటోలకు ప్రవేశం లేదని సర్పంచ్‌ బాలరాజు నర్సాగౌడ్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు నిర్ణయించారు. గ్రామంలోని పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సర్పంచ్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement