ఆ సారు వస్తే.. ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే
తనిఖీ చేస్తే.. చేయి తడపాల్సిందే
రిటైర్డుమెంట్‌కు ముందు వసూళ్ల పర్వం
జిల్లాలో హాట్‌టాఫిక్‌గా మారిన ఆ అధికారి
ఆ పోస్టు కోసం మరో అధికారి ప్రయత్నాలు
‘‘జిల్లాలోని అదో మేజర్ గ్రామపంచాయతీ. ఆరు నెలల క్రితమే కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ప్రభుత్వం ద్వారా మంజూరవుతున్న నిధులు, స్థానికంగా వసూలయ్యే పన్నులతో గ్రామాభివృద్ధి చేయాలని ఆ పాలకవర్గం భావిస్తుంది. గతానికి భిన్నంగా కొంతైనా మెరుగైన పాలనతో ప్రజల్లో గుర్తింపు పొందాలని ఆశిస్తుంది. ఓ జిల్లా స్థాయి అధికారి గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేసేందుకు వచ్చారు. అన్నీ పరిశీలించారు. ఆ పాలకవర్గం పాలనా పగ్గాలు చేపట్టి ఆరు నెలలే కావడంతో తనిఖీల్లో లోపాలు ఏమీ కనిపించలేదు. కానీ సదరు అధికారులు ‘ఫార్మాల్టీ’ ఉంటుందని రూ.10వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి వసూలు చేశారు.’’
‘‘జిల్లాలో అదో మైనర్ పంచాయతీ. జిల్లాస్థాయి అధికారి మండల స్థాయి అధికారులతో కలిసి తనిఖీలకు వచ్చారు. గ్రామపంచాయతీ రికార్డులు పరిశీలించారు. పంచాయతీ క్యాష్ బుక్, ఇంటి వసూళ్ల బుక్కులు, శానిటేషన్, కంపోస్ట్ షెడ్డు, ప్లాంటేషన్ వంటి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిన్న చిన్న లోపాలను గుర్తించి వాటిని సరి చేసుకోవాలని సూచించారు. నిధుల వినియోగంలో నిబంధనలు పాటించలేదని సాకుగా చూపుతూ మళ్లీ రూ.10వేలు డిమాండ్ చేశారు. చిన్న పంచాయతీ కావడంతో సదరు ఆ గ్రామ సర్పంచ్ ఏకంగా రూ.6వేలు సదరు అధికారికి ఫోన్ పే చేయడం విశేషం.’’
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా 260 గ్రామపంచాయతీలు ఉండగా అన్ని పంచాయతీలకు ఆరు నెలల క్రితమే కొత్త పాలకవర్గాలు కొలువు దీరాయి. కానీ రిటైర్డ్‌మెంట్‌కు దగ్గరగా ఉన్న ఓ జిల్లా అధికారి ఆరు నెలల్లో 29 గ్రామాలను తనిఖీ చేశారు. తనిఖీ చేసిన చోటల్లా చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీ సర్పంచులు డబ్బులు ఇచ్చేందుకు ససేమీరా అంటూ.. తర్వాత చూద్దాంలే అంటూ గట్టిగా సమాధామిస్తే.. ‘సర్పంచ్ సాబ్ జెర చూడండి.. నేను రిటైర్డుమెంట్‌కు ఉన్నా..‘ పార్మాల్టీ లేకుండా ఎలా’ అంటూ ప్రాధేయపడుతూ వసూలు చేయడం విశేషం.
పంచాయతీకో రేటు
జిల్లాలో మేజర్ పంచాయతీల్లో ఒకరకమైన రేటు. మైనర్ పంచాయతీల్లో మరో రకమైన రేటును నిర్ణయించి వసూళ్లే లక్ష్యంగా ఆ అధికారి విధులు నిర్వహించడం విశేషం. తనకు ఈ జిల్లాలో పని చేయడం ఇష్టం లేదని చెబుతూ ఆఖరి మోఖా అన్నట్లుగా ఫోన్లు చేస్తూ మరీ డబ్బులు గుంజుతున్నారు. తాను తనిఖీకి వెళ్లి గ్రామాల్లో ఏమైనా పొరపాట్లు దొరికితే మాత్రం గట్టిగా మందలిస్తూనే చేతివాటాన్ని భారీగా ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండలస్థాయిలో ఉండే అధికారులను మధ్యవర్తులుగా చేసుకుని లోపాలను గుర్తిస్తూ వసూళ్ల పర్వానికి తెరలేపుతున్నారు. కొత్త సర్పంచులు కావడంతో కొందరు సదరు అధికారి అడిగినంత సమర్పించుకోగా మరి కొందరు మాత్రం ఎందుకు ఇవ్వాలి అన్నట్లుగా ప్రశ్నిస్తున్నారు. ఆయన చేసే తనిఖీలు అన్నీ చేతివాటం కోసమే అన్నట్లుగా ఉండడం కొసమెరుపు.
జిల్లాకు వచ్చేందుకు మరో అధికారి పైరవీలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పని చేస్తున్న మరో డివిజనల్ స్థాయి అధికారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లాస్థాయి అధికారి రిటైర్డు కాగానే ఆయన స్థానంలో చేరేందుకు రాష్ట్రస్థాయిలో పైరవీలు చేస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే జిల్లా స్థాయిలో ముఖ్యనేతలను కలుస్తూ వారి సమ్మతాన్ని కోరుతూ జిల్లా అధికారులతో టచ్‌లో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో తన సొంత డిపార్టుమెంట్ ద్వారా బదిలీకి ప్రయత్నిస్తున్నారు. సదరు అధికారి ప్రయత్నాలు ఎలా ఉన్నా ప్రస్తుతం రిటైర్డుమెంట్‌కు సమీపంలో ఉన్న అధికారి అవినీతి పర్వం జిల్లాస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.


