అర్హులైన రైతులకు కోడెలు అందిస్తాం
● నేడు కోడెల పంపిణీ
వేములవాడఅర్బన్: దక్షిణా కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామికి భక్తులు తమ కోరిన కోర్కెలు తీరితే నిజ కోడెను కట్టెస్తామని మొక్కుకొని సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారికి అందించిన కోడెలను ఆలయ అధికారులు గోశాలలు ఏర్పాటు చేసి వాటిని సంరక్షణ చేస్తున్నారు. వాటిని రైతులకు ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు.
రెండు గోశాలలో రాజన్న కోడెలు
వేములవాడలో రెండు గోశాలలు ఉన్నాయి. ఒకటి గుడి చెరువు కట్టకింద ఉండగా మరోటి తిప్పాపూర్‌లో ఉంది. గుడికట్ట కింద గోశాలలో భక్తులు రాజన్న మొక్కులు తీర్చుకునేందుకు స్వామివారికి కట్టెసే కోడెలను సంరక్షణ చేస్తున్నారు. తిప్పాపూర్‌లో భక్తులు స్వామి వారికి అందించిన కోడెలను సంరక్షణ చేస్తున్నారు. తిప్పాపూర్ గోశాలలోని కోడెలను బుధవారం రైతులకు పంపిణీ చేయనున్నారు.
కోడెలకు చిన్న, సన్నకారు రైతులు అర్హులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు పరిసర జిల్లాల రైతులు కోడెల కోసం 1.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్న, చిన్నకారు ౖరైతులు కోడెలకు అర్హులు. ఆన్‌లైన్‌లో కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు సంబంధిత పత్రాలతో వస్తే బుధవారం ఉ.8 గంటలకు 100 జతల కోడెలు పంపిణీ చేయడం జరుగుతుంది. అర్హులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న కోడెలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
రైతులకు అందించిన కోడెల వివరాలు
క్రమసంఖ్య తేదీ కోడెలు
మొదటిసారి 1 జూన్ 2025 66
రెండో సారి 9 జూన్ 2025 202
మూడో సారి 11 జూన్ 2025 302
నాల్గోసారి 13 జూన్ 2025 132
ఐదో సారి 29 జూన్ 2025 240
ఆరవ సారి 27 జూలై 2025 160
ఏడో సారి 17 అక్టోబర్ 2025 172
ఎనిమిదవ సారి 21 జనవరి 2026 210
తొమ్మిదవసారి 07 ఏప్రిల్ 2026 420
రాజన్న కోడెలను అర్హులైన రైతులకు అందిస్తాం. కోడెలను తీసుకువెళ్లిన రైతులు వాటి సంరక్షణ బాధ్యతను పక్కాగా చూసుకోవాలి. పక్కదారి పట్టినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. గతంలో కోడెలు తీసుకున్న రైతులు వారి కుటుంబ సభ్యులు అర్హులు కాదు. – రవీందర్ రెడ్డి,
జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి


