● కలెక్టర్ గరీమా అగ్రవాల్
చందుర్తి(వేములవాడ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లె అనుబంధ గ్రామం గొల్లపల్లిలో రెండేళ్ల క్రితం మూతపడిన ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ శుక్రవారం పునర్ ప్రారంభించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. కిష్టంపేటలో పూర్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల గరించి తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. సర్పంచ్ బొజ్జ మల్లేశం, మండల ప్రత్యేకాధికారి రవీందర్‌రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ భూపతి, ఎంపీడీవో రాధ, ఎంఈవో వినయ్‌కుమార్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శంకరమ్మ పాల్గొన్నారు.
నేడు సిరిసిల్లకు కేటీఆర్
సిరిసిల్లటౌన్: జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో శనివారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పర్యటిస్తున్నారు. తెలంగాణ భవన్ వర్గీయులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10 గంటలకు సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావును పరామర్శిస్తారు. 10.30 గంటలకు వేములవాడలోని మహారాజ ఫంక్షన్‌హాలులో బీఆర్‌ఎస్ నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు.


