పల్లె మారింది | - | Sakshi
Sakshi News home page

పల్లె మారింది

Mar 18 2026 7:43 AM | Updated on Mar 18 2026 7:43 AM

గల్ఫ్‌ వలసల నుంచి సాఫ్ట్‌వేర్‌ వరకు..

నాలుగు దశాబ్దాల కిందట నెలకొన్ని కల్లోల పరిస్థితుల్లో వ్యవసాయం జూదంలా ఉండేది. పొట్ట చేతపట్టుకుని ముంబయి, దుబాయ్‌ వలసపోయే రోజులు. అరకొర ఆదాయం.. గల్ఫ్‌ వలసలు పల్లె జీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి. కారణాలు ఏమైనా పల్లె ముఖచిత్రం వేగంగా మారిపోయింది. చదువుకుంటూ ఉద్యోగాలు చేసే యువకులు.. పుట్టిపెరిగిన ఊరిలో అందమైన భవనాన్ని నిర్మించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయంలోనూ ఆధునిక విధానాలు రావడం, వాణిజ్యంగా కోళ్లఫారాలు వెలువడం, పసిడి పంటలతో పల్లె ఆర్థిక వ్యవస్థ బలపడింది. పల్లె ముంగిట్లోకి సూపర్‌మార్కెట్‌, బట్టల షోరూంలు రావడంతో ఊరు తీరు మారిపోయింది.

భూముల ధరలకు రెక్కలు

రాష్ట్రం వచ్చిన తర్వాత పల్లెల్లో భూములకు ధరలు పెరిగాయి. గతంలో భూములు కొనాలన్నా, అమ్మాలన్నా నక్సలైట్ల ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు అవేమీ లేకపోవడంతో స్వేచ్ఛా విఫణిలో భూముల రేట్ల పెరిగాయి. జిల్లాలోని ఏ పల్లెకు వెళ్లినా భూమి ఎకరం రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షలకు చేరింది. తారు రోడ్డును ఆనుకుని ఉంటే రూ.కోట్లలోకి చేరింది. రైతుబంధు, రైతుభరోసా వంటి పథకాలతో భూముల ధరలు పెరిగాయి. ప్రభుత్వం సైతం భూముల విలువను 2020 నుంచి మూడుసార్లు పెంచింది. పల్లెల్లోనూ ఇళ్ల స్థలాల ధర రూ.లక్షలకు చేరింది. తెలంగాణ జిల్లాల్లో తలసరి ఆదాయం రూ.3.56లక్షలకు చేరడంతో పల్లె జీవన శైలి మారింది. సెల్‌ఫోన్‌ ప్రభావం పెరిగింది. సామాజిక మాధ్యమాలు పెరగడంతో మంచి, చెడును తెలుసుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా సాంకేతిక విప్లవం పల్లెను చేరింది.

పల్లె మారింది. పల్లె జనం శైలి మారింది. అందమైన భవనాలు.. అంతకుమించి ఆదాయ వనరులు.. మారిన జీవన శైలి.. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు.. సాంకేతికత ఆలంబనగా పల్లె ప్రజలు పట్టణాలతో పోటీ పడుతున్నాయి. డూప్లెక్స్‌ ఇళ్లు, సీసీ కెమెరాల నిఘా, ఖరీదైన కార్లు.. సెల్‌ఫోన్లు, నిరంతరం ఇంటర్‌నెట్‌. పల్లె ముగింట్లో ఆధునిక సౌరభాల సందడి. జిల్లాలోని కోనరావుపేట మండలం బావుసాయిపేటలో రెండు దశాబ్దాల్లో వచ్చిన మార్పులు ఆ పల్లె రూపురేఖలను మార్చివేసింది.

కల్లోల పల్లె.. కనువిందు చేస్తుంది

ఊరు మారింది.. తీరు జోరుంది

వన్నెలద్దుకుంటున్న పల్లెలు

ఆధునికీకరణ దిశగా గ్రామీణ జీవనం

సిరిసిల్ల: రెండు దశాబ్దాల కింద భూమి కోసం.. భుక్తి కోసం నక్సలైట్ల సాయుధ పోరు.. వారిని కట్టడి చేసేందుకు పోలీసుల గాలింపులతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా ఉండేది. గోధూలి వేళ.. విప్లవ నినాదాలు.. ఆవేశపూరిత ప్రసంగాలు.. ప్రజాకోర్టులు.. అక్కడికక్కడే తీర్పులు.. వీపులు విమానపు మోతలు. తెల్లవారితే.. బూట్లచప్పుళ్లు.. పోలీసుల దిగ్బంధం.. ఊరంతా కట్టడి.. పోలీసుల ప్రజాదర్భార్‌.. అన్నలకు అన్నం పెట్టారంటూ.. నక్సలైట్ల సానుభూతిపరులపై పోలీసుల లాఠీల మోతలు.. అత్తగారు ముచ్చటపడి పెళ్లికి కట్నంగా బైక్‌ పెడతామంటే కూడా వద్దని వారించే కాలమది. పూరిళ్లు, రేకులషెడ్లు, తాటికమ్మల గుడిసెలు.. పెంకుటిండ్లు.. కొట్టాలు.. మిద్దె.. ఇవన్నీ నాటి నివాసాలు.

చిన్న పల్లె.. పెద్ద మార్పు

కోనరావుపేట మండలం బావుసాయిపేట చిన్నపల్లె. 2,289 మంది ఓటర్లతో ఉండే ఆ పల్లెజనాభా 4వేలలోపే. కానీ, శివారులోని రామన్నపల్లె కలిపి ఊరు విస్తరించింది. ఊరుకు మామిడిపల్లి, బండపల్లి, వట్టిమల్ల, వెంకట్రావుపేట నాలుగు వైపులా తారురోడ్లు, రెండు పెట్రోల్‌బంక్‌లు, మినీ రైస్‌మిల్లులు. బుధవారం వారపు సంత, ఇంటర్‌నెట్‌ సెంటర్‌, కల్యాణ మండపం, బైక్‌మెకానిక్‌ షాప్‌లు.. ఇలా పట్టణాల్లో కనిపించే ఆధునిక హంగులన్నీ బావుసాయిపేటలో చేరిపోయాయి. ఒకప్పటి కల్లోల పల్లె ఆధునిక పోకడలతో కనువిందు చేస్తుంది. ఒక్క ఈ ఊరే కాదు.. జిల్లాలో ఏ ఊరును చూసినా సమూల మార్పులు కళ్లముందు మెరుస్తున్నాయి. ఆధునికీకరణ దిశగా గ్రామీణ జీవనం సాగుతుంది. పల్లె తీరు మారింది.. ఊరు మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement