మానేరును తోడేస్తున్రు! | - | Sakshi
Sakshi News home page

మానేరును తోడేస్తున్రు!

Mar 18 2026 7:43 AM | Updated on Mar 18 2026 7:43 AM

‘ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌, పదిర శివారులోని చిట్టివాగు నుంచి ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు ట్రాక్టర్లలో ఇసుకను తరలించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న సమీప పొలాల రైతులు ట్రాక్టర్లను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు వచ్చేలోపే ఇసుక స్మగ్లర్లు ట్రాక్టర్లతో సహ పరారయ్యారు.’

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇసుక వ్యాపారుల అక్రమార్జనకు భూగర్భజలాలు పడిపోతున్నాయి. పంటలు చేతికొచ్చే దశలో బోరుబావుల్లో నీళ్లు అడుగంటుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని మానేరువాగులో నుంచి ఇసుకను ఇష్టారీతిగా తరలిస్తుండడంతోనే సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించిన రైతులు అక్రమంగా ఇసుక తరలింపును అడ్డుకుంటున్నారు. పగటిపూట అనుమతులతో ఇసుక తరలిస్తున్నా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో పలువురు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వీరు ఇష్టారీతిగా మానేరువాగులో తవ్వుతుండడంతో సమీప బావులు, బోరుబావులు అడుగంటుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు సాధారణంగా రైతులు పొలాల వద్ద కాపలా కాస్తుంటారు. కానీ జిల్లాలోని మానేరువాగు, చిట్టివాగు, నక్కవాగులను ఆనుకుని పొలాలు ఉన్న రైతులు మాత్రం రాత్రి పూట ఇసుక తీసుకెళ్లకుండా కాపలాగా ఉంటున్నారు.

ఎండుతున్న పంటలు

జిల్లా రైతుల వరప్రదాయని మానేరువాగు గంభీరావుపేట మండలం నర్మాల నుంచి బోయినపల్లి మండలం మిడ్‌మానేరు వరకు ప్రవహిస్తుంటుంది. మానేరువాగును ఆనుకుని 97వేల ఎకరాలలో వరి పంట సాగవుతుంది. ఇసుక వ్యాపారులు పైసాచికానికి పోయి అనుమతులు లేకుండా అర్ధరాత్రి కూడా వాగును తోడుతున్నారు. ఇలా ఇసుకను తీసుకెళ్తుండడంతో మానేరువాగులోని సమీప వ్యవసాయ బావులు, బోరుబావులు ఎండిపోతున్నాయి. ఫలితంగా మానేరువాగు, నక్కవాగులను ఆనుకుని ఉన్న సమీప పొలాల్లోని పంటలు ఎండిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి కాపాడుకుంటున్న పంటలు ఇసుక దొంగల కారణంగా ఎండిపోతుండడంతో కడుపుమండిన రైతులు అర్ధరాత్రి కాపలా ఉండి ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారు.

పంటల సమాచారం

జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం : 1,11,234 ఎకరాలు

మానేరువాగు ప్రాంతం :

79వేల ఎకరాలు

అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలింపు

ఇసుకాసురులపై రైతుల తిరుగుబాటు

జలవనరుల సంరక్షణకు అన్నదాతల తిప్పలు

రాత్రిపూట రెచ్చిపోతున్న స్మగ్లర్లు

పగటిపూట అనుమతులు.. చీకట్లో అక్రమాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement