సిరిసిల్ల: కక్షిదారులు ఈ నెల 28న జరిగే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు బి.పుష్పలత కోరారు. మంగళవారం జిల్లా కోర్టు సముదాయంలో న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసు అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. సాధ్యమైనంతవరకు ఎక్కువ కేసులు పరిష్కరించాలని సూచించారు. పోలీసు అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్, మెజిస్ట్రేట్లు ప్రవీణ్, సృజన, జ్యోతిర్మయి, కుమారి మేఘన, ఏఎస్పీ డి.చంద్రయ్య, సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, పోలీసు అధికారులు, కోర్టు మానిటరింగ్ పోలీసులు పాల్గొన్నారు.
రాజన్న సేవలో మంత్రి అడ్లూరి
వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ భీమేశ్వరస్వామిని మంగళవారం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి మంత్రి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం గావించగా, ఆలయ ఏఈవో శ్రావణ్‌కుమార్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. సిరిసిల్ల ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ జయంత్‌కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, ఎడ్ల శివసాయి, జూనియర్ అసిస్టెంట్లు సింహాచారి, నరాల రాజు తదితరులు పాల్గొన్నారు.
ముస్తాబాద్‌కు మల్లన్నసాగర్ జలాలు
ముస్తాబాద్(సిరిసిల్ల): మండు వేసవిలో రైతులకు ఉపశమనం కలిగించేలా మల్లన్నసాగర్ జలాలు ముస్తాబాద్ మండలానికి సోమవారం చేరుకున్నాయి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను 12వ ప్యాకేజీ ద్వారా మోహినికుంట, మద్దికుంట, చీకొడు చెరువులకు వదిలారు. సిద్దిపేట జిల్లా రాజక్కపేటలో చెరువు నిండి.. మద్దికుంట చెరువుకు వారం రోజులుగా గోదావరి జలాలు వస్తున్నాయి. ఈమేరకు మద్దికుంట చెరువు కూడా నిండి మత్తడి పోస్తోంది. దీంతో మోహినికుంట, మద్దికుంట రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి, బోరుబావులు ఎండుతున్నాయని రైతులు పేర్కొన్నారు. వరిపంటలు పండుతాయో లేదోననే ఆందోళనలో ఉన్న రైతులకు మల్లన్నసాగర్ జలాలు ఉపశమనం కలిగించాయి. ఏఈ నవీన్‌కుమార్ మద్దికుంట చెరువును పరిశీలించారు. వారం రోజుల్లో ముస్తాబాద్ లింగంకుంట చెరువుకు నీళ్లు చేరుతాయని తెలిపారు.


