కోనరావుపేట(వేములవాడ): ఓ వృద్ధురాలు బతికుండగానే మృతిచెందినట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేయగా.. ఆసరా పింఛన్‌కు దూరమైంది. వివరాలు.. కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన వృద్ధుడు మాదాసు నర్సయ్య 8 ఏళ్ల క్రితం మృతిచెందాడు. అతనికి వృద్ధాప్య పింఛన్ వచ్చేది. భర్త పింఛన్‌ను తన పేరిట మార్చాలని నర్సవ్వ అధికారులకు దరఖాస్తు చేసుకుంది. నెలలు గడుస్తున్నా పింఛన్ మంజూరు కాకపోవడంతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ అధికారులు చెప్పిన విషయం విని షాక్‌కు గురైంది. నర్సవ్వ మృతి చెందినట్లు రికార్డులో నమోదై ఉంది. దీంతో 8 ఏళ్లుగా అధికారులు, కార్యాలయాల చుట్టూ పింఛన్ కోసం తిరుగుతూనే ఉంది. చనిపోయింది తన భర్త అయితే తాను మృతి చెందినట్లు అధికారులు రికార్డు నమోదు చేశారని, వారి తప్పిదం వల్ల తనకు పింఛన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికై నా అధికారులు తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని వేడుకుంటోంది.
8 ఏళ్లుగా పింఛన్ కోసం తిరుగుతున్న వృద్ధురాలు
బతికుండగానే మృతిచెందినట్లు నమోదు చేసిన అధికారులు


