పాలిస్టర్‌ కార్మికుల కూలీ చర్చలు విఫలం | - | Sakshi
Sakshi News home page

పాలిస్టర్‌ కార్మికుల కూలీ చర్చలు విఫలం

Mar 13 2026 7:35 AM | Updated on Mar 13 2026 7:35 AM

సిరిసిల్ల: పాలిస్టర్‌, వైపణి, వార్పిన్‌ కార్మికులు కూలీ పెంపు చర్చలు విఫలమయ్యాయి. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో కార్మికశాఖ డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ ప్రసాద్‌ సమక్షంలో గురువారం జరిగిన సుదీర్ఘచర్చలు అర్ధంతరంగా ముగిశాయి. కూలీరేట్లను పెంచేందుకు పాలిస్టర్‌ యజమానులు అంగీకరించలేదు. ఇప్పటికే తొలిదశ చర్చలు విఫలం కాగా.. మలిదశ చర్చలు గురువారం జరిగాయి. యజమానులకు, కార్మికులకు జరిగిన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. పాలిస్టర్‌ అసోసియేషన్‌, కార్మిక నేతల మధ్య జరిగిన కూలీ ఒప్పందం గడువు 2022లో ముగిసింది. చిన్న పన్న పది పిక్కులకు(పోగులు) ప్రస్తుత కూలీ 25పైసలు ఉండగా.. 30 పైసలు, పెద్ద పన్నకు 26 పైసలు ఉండగా.. 35 పైసలు ఇవ్వాలని కోరుతున్నారు. వార్పిన్‌ కార్మికులకు 1000 పోగులకు 1250 మీటర్ల వరకు రూ.40 కూలీ ఇవ్వాలని, వైపణి కార్మికులకు 1000 పోగులకు రూ.110 చెల్లించాలని, టెక్స్‌టైల్‌ పార్క్‌లో పది పిక్కులకు 50 పైసలు చెల్లించాలని కార్మిక నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వస్త్రపరిశ్రమ ఉన్న పరిస్థితుల్లో కూలీ పెంపు సాధ్యం కాదని, ప్రస్తుతం ఉన్న రేట్లను అమలు చేస్తామని యజమానుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో కూలీచర్చలు కొలిక్కి రాలేదు.

పక్షం రోజుల గడువు

మరో పక్షం రోజుల్లో కూలీ పెంపు ఒప్పందం చేసుకోవాలని, మరో దఫా చర్చలు సిరిసిల్లలోనే నిర్వహిస్తామని డీసీఎల్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. మళ్లీ చర్చలు జరిగే వరకు కార్మికులు సమ్మెకు వెళ్లకుండా ఆగాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా యజమానులతో మాట్లాడి కూలీ రేట్లు పెంచే ప్రయత్నం చేస్తామని లేబర్‌ అధికారులు స్పష్టం చేశారు. చర్చల్లో అసిస్టెంట్‌ లేబర్‌ అధికారి రఫీ, పాలిస్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్‌, కార్యదర్శి రవి, కార్మిక నాయకులు మూషం రమేశ్‌, కోడం రమణ, సిరిమల్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement