ముస్తాబాద్(సిరిసిల్ల): ఆన్‌లైన్‌లో యూరియా కోసం స్లాట్ బుక్ చేసుకున్న రైతులకు చుక్కెదురైంది. ఇతర మండలాల రైతులకు ఇక్కడ ఎలా యూరియా ఇస్తారంటూ మండలంలోని గూడెం రైతులు నిలదీశారు. ఈ సంఘటన బుధవారం చర్చనీయాంశమైంది. మండలంలోని గూడెంలో సహకార సంఘానికి చెందిన గోదాంలో యూరియా పంపిణీ చేస్తున్నారు. గూడెం గోదాముకు ఆన్‌లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న గంభీరావుపేట మండలానికి చెందిన రైతులు పలువురు బుధవారం వచ్చి యూరియా బస్తాలు తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గూడెం రైతులు అభ్యంతర తెలిపారు. ఇతర మండలాలకు చెందిన రైతులకు ఇక్కడ ఎలా యూరియా ఇస్తారంటూ ఆందోళనకు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యూరియా తీసుకెళ్లకుండా పెట్రోల్ పోసి నిప్పంటిస్తామని బెదిరింపులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు గోదాం వద్దకు చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఆన్‌లైన్‌లో యూరియా నిల్వలు చూసుకుని ఎక్కడి నుంచైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది.
గంభీరావుపేట రైతులతో గూడెం రైతుల వాగ్వాదం
ఇతర మండల రైతులకు ఎలా ఇస్తారంటూ నిలదీత
పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన వివాదం


