యువతకు శిక్షణ.. పరిశ్రమకు రక్షణ
పవర్‌లూమ్ శిక్షణ కేంద్రం మూసివేత
దశాబ్దకాలంగా యువతకు తర్ఫీదు కరువు
సిరిసిల్లలో నైపుణ్య కార్మికుల కొరత
యువ‘తరం’..
సిరిసిల్ల: సిరిసిల్లలో యువతకు పవర్‌లూమ్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు 2005లో పవర్‌లూమ్ శిక్షణ కేంద్రాన్ని బద్దెనపల్లి టెక్స్‌టైల్ పార్క్‌లో ప్రారంభించారు. పదో తరగతి చదువుకున్న యువకులకు నెలనెలా రూ.1,000 ఉపకార వేతనం ఇస్తూ ఆరునెలల పాటు శిక్షణ ఇచ్చేవారు. శిక్షణ పొందిన యువకులు స్థానికంగా టెక్స్‌టైల్ పార్క్‌లోని ఆధునిక ర్యాపియర్ లూమ్స్, సిరిసిల్లలోని పవర్‌లూమ్స్ నడిపేందుకు అవకాశం ఉంది. ఇలా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి నమ్మకమైన ఉపాధి కల్పించాలని ప్రభుత్వ లక్ష్యం. ఏడేళ్ల పాటు ఓ వెయ్యి మందికి శిక్షణ ఇచ్చారు. 2015 నుంచి టెక్స్‌టైల్ పార్క్‌లోని పవర్‌లూమ్ శిక్షణ కేంద్రం మూతపడడంతో యువతకు శిక్షణ లేక, సాంచాలు నడిపే నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఏర్పడింది.
ఉపకార వేతనం అసలు సమస్య
ప్రభుత్వం ఇచ్చే రూ.1,000 ఖర్చులకు సరిపోక సిరిసిల్ల నుంచి టెక్స్‌టైల్ పార్క్ వరకు వెళ్లి రావడం ఇబ్బందిగా మారడంతో శిక్షణ పొందేందుకు అభ్యర్థులు ముందు రాలేదు. దీంతో శిక్షణ కేంద్రం మూతపడింది. చేనేత, జౌళిశాఖ అధికారులు 2017లో రూ.5వేల ఉపకార వేతనం శిక్షణ పొందే నిరుద్యోగులకు ఇవ్వాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి పంపించారు. కానీ, ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను బుట్టదాఖలు చేయడంతో పవర్‌లూమ్స్ శిక్షణ కేంద్రం మూతపడింది. ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు నియమితులైన సిబ్బందికి కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.8వేల ఉపకార వేతనం ఇస్తూ ఆరునెలల పాటు శిక్షణ ఇస్తే వస్త్రపరిశ్రమకు బాసటగా ఉండేది. పదేళ్లుగా శిక్షణ లేక, కొత్తతరం ఈ పనుల్లోకి రాక స్థానికంగా నేత కార్మికుల సమస్య ఎదురవుతోంది. ఇప్పటికై నా జౌళిశాఖ ఉన్నతాధికారులు పవర్‌లూమ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తే యువకుల ఉపాధికి ఊతమిచ్చినట్లు అవుతుంది.
శిక్షణ ఇస్తేనే ఉపాధి రక్షణ
సిరిసిల్లలో కాలం చెల్లిన మగ్గాలను నడుపుతూ, మార్కెట్‌లో డిమాండ్ లేని పాలిస్టర్ బట్టను ఉత్పత్తి చేస్తూ వస్త్రపరిశ్రమ తరచూ సంక్షోభానికి గురవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన మహిళా శక్తి చీరలు నాణ్యతగా ఉండడంతో బహిరంగ మార్కెట్‌లోనూ డిమాండ్ ఉంది. సాంచాలు నడిపే కార్మికుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం పవర్‌లూమ్ శిక్షణ కేంద్రాన్ని మళ్లీ ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తరాది కార్మికులతో ఇప్పుడు వస్త్రపరిశ్రమ మనుగడ సాగిస్తున్నా.. భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. స్థానిక యువతకు శిక్షణ ఇస్తే.. ఉపాధికి రక్షణ లభిస్తుంది. వస్త్రోత్పత్తికి మెరుగైన కూలి ప్రభుత్వమే నిర్ణయించడం, అదనంగా 10 శాతం యారన్ సబ్సిడీ ఇవ్వడం, పొదుపు పథకాలు అమలు చేయడం వంటి ప్రోత్సాహకాలతో యువత ఉపాధికి మార్గం ఏర్పడుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
‘సిరిసిల్ల నెహ్రూనగర్‌కు చెందిన వస్త్రోత్పత్తిదారుడికి 20 జోడీల సాంచాలు ఉన్నాయి. కానీ, అతనికి నేత కార్మికులు లేక బిహార్‌కు చెందిన లేబర్లను తెప్పించి సాంచాలు నడుపుతున్నాడు. ఒక్కో బిహార్ లేబర్ నెలకు రూ.25వేలు సంపాదిస్తున్నారు. స్థానికంగా నేత కార్మికులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల కార్మికులపై ఆధారపడాల్సి వస్తుంది. ఏదైనా పనిపై వాళ్లు వెళ్లిపోతే.. సాంచాలు బందు పెట్టుకోవాల్సిందే. ఎక్కడ వెతికినా.. బట్టనడిపేందుకు కార్మికులు దొరకని పరిస్థితి సిరిసిల్లలో ఉంది. నేటి తరం యువకులు ఎవరూ సాంచాలు నడుపడం లేదు. ఇతర పనుల్లో అరకొర వేతనాలతో వెళ్లదీస్తున్నారు’.


