సిరిసిల్ల: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) విధానంతో ఉద్యోగులకు సామాజిక భద్రత కరువైందని, సీపీఎస్ రద్దయ్యే వరకు పోరాటం ఆగదని టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ భవన్‌లో మంగళవారం జరిగిన సీపీఎస్ ఉద్యమ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. సీపీఎస్ ఉద్యోగులంతా ఏకం కావాలని, సభ్యత్వ నమోదును ప్రారంభించామన్నారు. సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ, సీపీఎస్ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ తర్వాత సర్వీస్ పెన్షన్ లేకపోవడం, వైద్య సదుపాయం కోసం ఈహెచ్‌ఎస్(ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్) వర్తించకపోవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జిల్లా అధ్యక్షుడిగా సంజీవ్, ప్రధాన కార్యదర్శిగా రవీందర్, కోశాధికారి లక్ష్మీనారాయణను ఎన్నుకున్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డా.బాబు, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నిసర్ ఆహ్మద్, సురేందర్‌రెడ్డి, రమేశ్, ఆర్‌వీవీ స్వామి తదితరులు పాల్గొన్నారు.


