పెద్దపల్లి: జిల్లాలోని కొన్ని ఇటుకబట్టీల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తున్నారు. అందులో పనిచేసే కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలేదు. తమకు అందిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికారులు ఇలాంటి బట్టీలను గుర్తించి సీజ్ చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని రెండు ఇటుకబట్టీలను సీజ్ చేయడం గమనార్హం. జిల్లాలో సుమారు 150 నుంచి 200 వరకు చిన్న, మధ్య తరహా ఇటుకబట్టీలు ఉన్నాయని అంచనా.
వలస కార్మికుల డాటా ఎక్కడ?
జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉన్న ఇటుకబట్టీల్లో పనిచేసే కార్మికులు, వారి కుటుంబాల డాటా ఎక్కడ నమోదు కావడం లేదని అంటున్నారు. వలస కార్మికులను గంపగుత్తగా ఏజెంట్‌తోనే మాట్లాడుకుంటున్న నిర్వాహకులు తమ ఇటుకబట్టీల్లోకి తీసుకొచ్చి పనులకు పురమాయిస్తునానరని అంటున్నారు. ఇటుకబట్టీలోకి వలసకార్మికులు వచ్చిన వెంటనే ఆధార్‌తో సహా ఇతర సమాచారాన్ని కార్మికశాఖ, పోలీస్ అధికారులకు ఇవ్వాల్సి ఉన్నా.. ఈ నిబంధనేదీ ఇవ్వకుండా దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇటుకబట్టీల వద్ద నివాసం ఉండే కార్మికులు, వారికుటుంబాలకు సురక్షితమైన తాగునీరు అందించాలనే నిబంధన ఎక్కడా అమలు కావడంలేదు
● వ్యవసాయ బావులు, బోరుబావుల నీళ్లే దిక్కవుతోంది
● తాత్కాలిక వసతి కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది.
● రోజూ 8 గంటల వరకే పనిచేయాల్సి ఉన్నా.. అంతకుమించి పనులు చేయించుకుంటున్నారు
● కనీస వేతనాలు కూడా అమలు చేయడంలేదు
● కార్మికుల పిల్లలకోసం ట్యూటర్‌ను నియమించి పాఠశాల ప్రారంభించాల్సి ఉన్నా.. వర్క్‌సైడ్ స్కూల్ ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండాపోతోంది
● అధికారులు తనిఖీకి వస్తున్నారని సమాచారం అందిన వెంటనే బడి తెరుస్తారని, లేకుంటే మూసివేసి ఉంచుతారనే ఆరోపణలు ఉన్నాయి.
● కార్మిక శాఖలో తగినమంది అధికారులు, సిబ్బంది లేకపోవడంతో ఇటుక బట్టీల్లో ఏం జరుగుతుంతో పర్యవేక్షించే అవకాశం లేకుండాపోతోంది.
ఇటుకబట్టీల్లో కనీస సౌకర్యాలు కరువు
కార్మిక శాఖ వద్ద నమోదు కాని వివరాలు


