ఫెర్టిలైజర్‌పిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 23వ డివిజన్ ప్రగతినగర్‌కు చెందిన యువ దంపతులు కావలి ప్రియాంక–నరేశ్.. తమ వివాహ వార్షికోత్సవాన్ని సమాజహితంతో గుర్తుండిపోయేలా చేసుకున్నారు. సోమవారం తమ పెళ్లిరోజు సందర్భంగా తమ మరణానంతరం నేత్ర, అవయవదానం చేయాలని ప్రతిజ్ఞ చేసి ఆదర్శంగా నిలిచారు. ఫొటో స్టూడియో నిర్వాహకులైన ఈ దంపతులు అవయవదానం కోసం అంగీకార పత్రాలపై సంతకం చేశారు. దంపతుల నుంచి ఆ పత్రాలను లయన్స్ క్లబ్ 320జి రీజయన్–9, జోన్–2 విజన్ కో ఆర్డినేటర్ కోదాటి ప్రవీణ్, లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతినగర్ ప్రగతి సెక్రటరీ దొండపాటి మహేందర్‌రెడ్డి స్వీకరించారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసుకు అందజేశారు. ప్రేమవివాహం చేసుకుని ఆదర్శవంతంగా జీవిస్తున్న ఈ జంట తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సమాజానికి మేలు చేయాలనుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ప్రతినిధులు నార్ల ప్రసాద్, టి.శ్రవణ్ కుమార్, లింగమూర్తి, చంద్రమౌళి, వాసు తదితరులు పాల్గొన్నారు.


