చక్కని అవకాశం
జ్యోతినగర్(రామగుండం): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం యువ విజ్ఞాన కార్యక్రమ్(యువిక–2026) ద్వారా పిల్లల ఆలోచనలకు మెరుగులు దిద్దితే.. భావిశాస్త్రవేత్తలుగా మార్చుకోవచ్చనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతరిక్ష సాంకేతిక, అంతరిక్షశాస్త్రం, అనువర్తనాలపై ప్రాథమిక జ్ఞానం అందించడమే దీని లక్ష్యం. ఈమేరకు విద్యార్థుల నుంచి ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఏప్రిల్ 13న తొలిజాబితా, 20న రెండోజాబితా ప్రకటిస్తారు. మే 11 నుంచి 22వ తేదీ వరకు శిక్షణ ఇస్తారు. ఎంపికైన విద్యార్థులకు ప్రయాణ రాయితీ కల్పించి, వసతి, బస ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నారు.
దరఖాస్తు ఇలా చేయాలి..
www.isro.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత యువికా ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో విద్యార్థి వి వరాలు నమోదు చేయాలి. విద్యార్థులు 2026 జన వరి 1 నాటికి తొమ్మిదో తరగతి చదువుతుండాలి. ఎనిమిదో తరగతి మార్కుల ఆధారంగా 50 శాతం మందికి, ఆన్‌లైన్‌లో క్విజ్‌లో ప్రతిభకు 10 శాతం, సైన్స్‌ఫేర్‌లో పాల్గొన్న వారికి 10 శాతం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లకు 5 శాతం, గ్రామీణ విద్యార్థులకు 15 శాతం అనుమతి కల్పిస్తారు.
యువికా ఉద్దేశం ఇదే..
ఇస్రో చేపట్టిన ‘యువికా’కు ఎంపికై న విద్యార్థులతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు అంతరిక్ష కేంద్రాలకు చేరుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఇస్రోకు చెందిన అహ్మదాబాద్, డెహ్రాడూన్, శ్రీహరికోట, హైదరాబాద్, బెంగళూరు, షిల్లాంగ్, తిరువనంతపురం తదితర కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. ఇక్కడ విద్యార్థులకు ప్రముఖ శాస్త్రవేత్తలతో ముఖాముఖి, చర్చావేదికలు, ప్రయోగశాలల సందర్శన, ముఖ్యులతో సమావేశాల్లో పాల్గొనేందుకు అవకాశమిస్తారు. అంతరిక్షశాస్త్రం, రాకెట్ ప్రయోగ అంశాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు.
భావిశాస్త్రవేత్తలకు ఇస్రో పిలుపు
ఇస్రో నిర్వహించే యంగ్ సైంటిస్ట్ కార్యక్రమం విద్యార్థులకు చక్కని వేదిక. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆసక్తి గలవిద్యార్థులతో దరఖాస్తు చేసేలా ప్రోత్సహించాలి.
– జింక మల్లేశం, డీఈవో, రామగుండం


