జగిత్యాలటౌన్: కన్నతండ్రి, సోదరుడు (అమ్మ సవతి కొడుకు)నుంచి తనకు రక్షణ కల్పించాలని ఓ యువతి సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బీఎస్.లతకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం సంకెనపల్లికి చెందిన సామెల్ మొదటి భార్య మరణించడంతో మందమర్రికి చెందిన శకుంతలను సంప్రదాయ పద్ధతిలో పెద్ద మనుషుల సమక్షంలో రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే మొదటి భార్యకు కుమారుడు రాజు ఉన్నాడు. శంకుతలతో పెళ్లి సమయంలో బంగారం, వెండి వస్తువులు ఇస్తానని నమ్మించాడు. ఇప్పుడు అమ్మ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు లాక్కున్నాడు. పెళ్లి తర్వాత బంగారం గురించి అడగడంతో అమ్మను టార్చర్ పెడుతున్నాడు. శంకుతల గర్భిణిగా ఉన్నప్పటి నుంచే రాజు, సామేల్ కలిసి అమ్మను కొడుతూ ఉండేవారు. రోజూ శారీరకంగా, మానసికంగా వేధించి ఆఖరికి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ప్రస్తుతం నేను పదవ తరగతి చదువుతున్నాను. నా చదువుకు.. ఇల్లు గడవడానికి కష్టంగా ఉంది. మానాన్న (సామెల్) పేరున ఉన్న 1.20 ఎకరాల భూమితో సంబంధం లేదంటున్నారు. భూమి గురించి అడిగితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. నా కన్న తండ్రితోపాటు సోదరుడి నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలి అంటూ మొర పెట్టుకుంది.
ప్రజావాణిలో కూతురు ఫిర్యాదు


