కరీంనగర్‌టౌన్: మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి 2026–27 సంవత్సర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట మత్స్యకారులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ దశాబ్ద కాలంగా చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారన్నారు. మత్స్యకారులందరూ ఐక్యంగా ఉద్యమించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, న్యాయమైన సమస్యలు పరిష్కారానికి ఈనెల 17న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎంకేఎంకేఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిట్టల వెంకన్న, జనగరి గణేశ్, కోశాధికారి సదానందం, సహాయ కార్యదర్శి సంపత్, నూనె శేఖర్, మేకల ఆంజనేయులు, మేకల కిరణ్, కంటే సురేశ్, పి.హనుమంతు, పి కుమార్ గడప పరశురాం తదితరులు పాల్గొన్నారు.


