ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లి, రాచర్లతిమ్మాపూర్ గ్రామాల్లో శనివారం పోచమ్మ బోనాలు తీశారు. రాచర్లగొల్లపల్లిలో రెడ్డి సంఘం, రాచర్లతిమ్మాపూర్‌లో అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో బోనాలు తీశారు. పోచమ్మతల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, సర్పంచ్ కొండ రమేశ్‌గౌడ్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని పెద్దలింగాపూర్‌లో 26 రోజులుగా రైతులు చేపట్టిన రిలేనిరాహార దీక్షలు శనివారం కొనసాగాయి. అసంపూర్తిగా ఆగిపోయిన ఎల్‌ఎం 6 కాలువను పూర్తి చేయాలని వారు కోరారు. రైతులు కరికె నవీన్‌కుమార్, ఎద్దు విజయ, మహేందర్, నర్సయ్య, అనిత, దుమాల భారతి, అంబటి అనిత, పయ్యావుల ఎల్లవ్వ, గాదె రవి పాల్గొన్నారు.
నేడు హెచ్‌పీవీ టీకా
సిరిసిల్ల అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రి, వేములవాడ ప్రాంతీయ ఆస్పత్రి, ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రజిత తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ను నివారించేందుకు 2011, ఏప్రిల్ 1 నుంచి 2012, మార్చి 31 మధ్య జన్మించిన వారికి టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో 3,773 మంది బాలికలను గుర్తించినట్లు పేర్కొన్నారు. శతశాతం వ్యాక్సిన్ వేయించి బాలికల బంగారు భవిష్యత్‌కు బాట వేయాలని తెలిపారు. జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


