సిరిసిల్ల చేనేత శిల్పి అద్భుత ప్రతిభ మహిళా దినోత్సవం నేపథ్యం చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్–రేఖ దంపతుల సృష్టి
సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత శిల్పి వెల్ది హరిప్రసాద్–రేఖ దంపతులు భారత నారీశక్తి ప్రతిబింబించేలా అద్భుతమైన పట్టుచీరను నేశారు. మూడు నెలలపాటు శ్రమించి ప్రత్యేకంగా చేనేతమగ్గంపై పట్టుచీరను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారీశక్తి స్ఫూర్తితో గతేడాది మన దేశ ఆడబిడ్డలు ఎన్నో ఘనవిజయాలు సాధించారన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్‌తో మనదేశం మహిళల సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. క్రీడారంగంలోనూ ఎన్నో గొప్ప విజయాలు సాధించారన్నారు. వారి విజయాలన్నింటిని ప్రతిబింబించేలా చేనేత చీరను నేసినట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌తోపాటు షూటర్ సుజిత్‌సింగ్ ముఖచిత్రాలు, మహిళా క్రికెట్ వరల్డ్‌కప్, మహిళా కబడ్డీ వరల్డ్‌కప్, అంధుల మహిళా క్రికెట్ వరల్డ్ కప్, ఆర్చర్ సీతల్‌దేవి జ్యోతి చిత్రాలను ఒకే పట్టుచీరపై ఇమిడేలా నేసినట్లు వెల్లడించారు. మన దేశ మహిళల విజయాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరోసారి గుర్తుచేయాలని ఈ ప్రత్యేకమైన చీరను సిద్ధం చేసి వారికి అంకితం చేస్తున్నామన్నారు. చీర పొడవు 5.5 మీటర్లు, చీర బరువు 0.560 గ్రాములు, చీర నేసేందుకు రూ.లక్ష ఖర్చు చేసినట్లు వారు వివరించారు.


