● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి/వేములవాడ అర్బన్(వేములవాడ):
రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో చేసిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి, వేములవాడలో శుక్రవారం 99 రోజుల కార్యక్రమాన్ని విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానికంగా వైద్య సేవలందించడం కష్టంగా మారితే రోగులను వేములవాడ, సిరిసిల్లకు తరలించి చికిత్స అందజేస్తామని వివరించారు. ఏప్రిల్ 2 నుంచి 15 వరకు గ్రామసభల్లో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. స్థలం కోసం చూస్తున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సర్పంచ్ పులి సత్తయ్య, ఉపసర్పంచ్ బత్తుల క్రాంతి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్, చింతపంటి రామస్వామి, బొజ్జ మల్లేశం ఉన్నారు.


