● జిల్లాలో ప్రత్యేక డ్రగ్ డీ అడిక్షన్ కేంద్రం ● అందుబాటులో వైద్యులు.. మానసిక నిపుణులు
సిరిసిల్ల అర్బన్: మత్తులో జీవితాలు రోడ్డుపాలవుతున్నాయి. తెల్లవారకముందే బెల్టుషాపులో మద్యం తాగి మత్తులో తూగుతున్నారు. మత్తుతో చిత్తవుతున్న వారిని మార్చేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మద్యం, డ్రగ్స్, గంజాయి మత్తును వదిలించేందుకు జిల్లాలో డీ ఆడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. మత్తులో చిత్తవుతున్న వారిని బయటపడేలా చేసేందుకు డీ అడిక్షన్ సెంటర్‌లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ బస్తీ దవాఖానాఈ డీ అడిక్షన్ కేంద్రాన్ని జిల్లా పోలీసుశాఖ, లీగల్ హెడ్ క్లినిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
వైద్యులు, మానసిక నిపుణుల పర్యవేక్షణలో..
సిరిసిల్ల పట్టణ పరిధిలోని రాజీవ్‌నగర్ బస్తీ దవాఖానాలో రెండేళ్ల క్రితం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ సెంటర్‌ను ప్రారంభింపజేశారు. ప్రధానంగా మత్తు పదార్థాలకు, గంజాయికి బానిసై, తల్లిదండ్రులు చెప్పినా వినకుండా ఉండే యువతీ, యువకులను గుర్తించి వారికి ఈ డీ–అడిక్షన్ సెంటర్‌లో కౌన్సెలింగ్ ఇస్తారు. మత్తు పదార్థాలకు, డ్రగ్స్‌కు దూరం చేసేందుకు డీ–అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉన్మాదిగా మారితే ఆ కుటుంబం వీదిన పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారిని గుర్తించి సన్మార్గంలో నడిపించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఈ సెంటర్‌లో నలుగురికి వైద్యసేవలు అందించారు. గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించి టెలీ మానస్ 14416 టోల్ ఫ్రీ నంబర్‌లో సంప్రదించవచ్చని వైద్యనిపుణులు తెలిపారు.


