● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ను అధికారులు సమన్వయంతో అమలు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల అధికారులు నిర్ణీత కాలపరిమితిలో లక్ష్యాలను సాధించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి ఆయా కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించి విజయవంతం చేయాలన్నారు. ఈనెల 12న జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల సర్పంచులు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల వార్డుసభ్యులు, చైర్మన్లకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై శిక్షణ ఉంటుందని వె ల్లడించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్డీవో ఎం.గీత, డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, డీపీవో షరీఫొద్దీన్, జిల్లా వైద్యాధికారి రజిత, హౌసింగ్ పీడీ సాజిద్, డీటీవో లక్ష్మణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, సంపత్‌కుమార్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్, తహసీల్దార్ మహేశ్‌కుమార్ పాల్గొన్నారు.
గృహ ప్రవేశానికి సిద్ధం చేయాలి
ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ కోరారు. సిరిసిల్ల నాలుగో వార్డులో ఎలిగేటి రూపిక, కొండబత్తిని పండరి, కొయ్యాడ మానస ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఆన్‌లైన్‌లో ఫొటోలతో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
పరీక్ష కేంద్రం తనిఖీ
జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. వసతులపై ఆరా తీశారు. గురువారం మొత్తం 3,531 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 79 మంది గైర్హాజరయ్యారు.
ప్రచార రథం ప్రారంభం
పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రచార రథాన్ని కలెక్టరేట్‌లో కలెక్టర్ గరీమా అగ్రవాల్ జెండా ఊపి ప్రారంభించారు. మూడు కిలోవాట్ల సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుంటే కేంద్రం రూ.78వేలు సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ప్రతి నెలా రూ.2వేలు బిల్లు ఆదా అవుతుందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ‘సెస్’ ఎండీ భిక్షపతి, డీఈ అంజయ్య, డీవో మునీందర్‌రెడ్డి, ఏడీవో లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.


